డాక్టర్లు సెలవులు తీసుకోవద్దు: మంత్రి హరీశ్ రావు

  • వరద ప్రభావిత జిల్లాల వైద్యాధికారులతో హరీశ్ రావు సమీక్ష
  • అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం
  • ముంపు గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్న హరీశ్
వరద ముంపుకు గురైన గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలని చెప్పారు. వైద్యులు సెలవులు తీసుకోకుండా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని, ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో పాల్గొనాలని తెలిపారు. అవసరమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉంచి సరఫరా చేయాలని చెప్పారు. 

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల జిల్లాల వైద్యాధికారులతో, డాక్టర్లతో ఈరోజు హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగూడెం కేంద్రంగా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మంచిర్యాల కేంద్రంగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్ రెడ్డి విధులు నిర్వహిస్తూ... హెల్త్ క్యాంపులు, ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో అధికారులతో సమన్వయం చేసుకుంటూ పాల్గొనాలని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.


More Telugu News