అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే!... యూపీలో ప్రారంభించిన మోదీ!

  • 296 కిలో మీటర్ల మేర బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే
  • రూ.14,850 కోట్ల‌తో నిర్మించిన కేంద్ర ప్ర‌భుత్వం
  • 6 లేన్ల‌తో 7 జిల్లాల మీదుగా సాగ‌నున్న ర‌హ‌దారి
దేశంలో ర‌హ‌దారుల ప్ర‌మాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతం పురోభివృద్ధి ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా ఏర్పాటు చేసిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన 7 జిల్లాల‌ను క‌లుపుతూ 296 కిలో మీటర్ల మేర ఈ ర‌హ‌దారిని నిర్మించారు. 6 లేన్ల‌తో ఏర్పాటైన ఈ ర‌హ‌దారికి కేంద్రం ఏకంగా రూ.14,850 కోట్ల‌ను వెచ్చించింది. ఈ ర‌హ‌దారిని శ‌నివారం యూపీలోని జ‌లాన్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ లాంఛ‌నంగా ప్రారంభించారు. 

ఈ కొత్త ర‌హ‌దారికి చెందిన ఫొటోలు, వీడియోలు గ‌డ‌చిన రెండు, మూడు రోజులుగా చక్క‌ర్లు కొడుతున్నాయి. అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో నిర్మిత‌మైన ఈ ర‌హ‌దారితో బుందేల్‌ఖండ్ రూపు రేఖ‌లే మారిపోతాయ‌ని మోదీ స‌ర్కారు చెబుతోంది. ఈ ర‌హ‌దారితో బుందేల్‌ఖండ్ పారిశ్రామికంగానే కాకుండా ఆయా ప్రాంతాల‌తో మ‌రింత మెరుగైన వ్యాపార బంధాలు నెల‌కొనే అవ‌కాశాలున్నాయ‌ని కేంద్రం చెబుతోంది. ఈ ర‌హదారిని మోదీ ప్రారంభించిన వీడియోను కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.


More Telugu News