మోదీ చ‌ర్య‌ల‌తో రైతుల ఆదాయం రెట్టింపైంద‌న్న కేంద్రం.. ఎక్క‌డో చెప్పాలన్న కేటీఆర్‌

  • కేంద్ర వ్యవ‌సాయ శాఖ ప్ర‌క‌ట‌న‌పై వేగంగా స్పందించిన‌ కేటీఆర్
  • ఆ వివ‌రాల‌ను ప్ర‌ధాని ప్ర‌జ‌ల ముందు పెట్టాల‌ని డిమాండ్
  • రెట్టింపు ఆదాయాన్ని సాధించిన రైతులు ఎన్ని ల‌క్ష‌ల మంది అని ప్ర‌శ్న‌
  • వారంతా ఎక్క‌డివారో, ఏ ప్ర‌భుత్వ ప‌థ‌కం వారికి ఉప‌యోగ‌ప‌డిందో చెప్పాల‌ని డిమాండ్‌
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేప‌ట్టిన చ‌ర్య‌లు, దేశ రైతాంగానికి చేసిన సూచ‌న‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రిత్వ శాఖ శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశ‌గా మోదీ చేసిన సూచ‌న‌లు పాటించిన రైతులు రెట్టింపు కంటే అధిక ఆదాయం రాబ‌ట్టార‌ని ఆ శాఖ తెలిపింది. ఇలా చాలా మంది రైతులు రెట్టింపు కంటే అధికాదాయం సంపాదిస్తున్నార‌ని ఆ శాఖ తెలిపింది. 

కేంద్ర వ్య‌వసాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌ను చూసినంత‌నే టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ వేగంగా స్పందించారు. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ ప్ర‌క‌ట‌న నిజ‌మే అయితే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆ వివ‌రాల‌ను దేశ ప్ర‌జ‌ల ముందు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ధాన మంత్రికి 3 ప్ర‌శ్న‌ల‌ను సంధించారు.

దేశంలో రెట్టింపు ఆదాయాన్ని సాధించిన రైతులు ఎన్ని ల‌క్ష‌ల మంది ఉన్నారో తెల‌పాల‌ని కేటీఆర్ కోరారు. ఈ రైతులు ఏఏ రాష్ట్రాల‌కు చెందిన వారో కూడా తెలపాల‌ని కోరారు. ఇలా రైతులు త‌మ ఆదాయాల‌ను రెట్టింపు చేసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డిన ప్ర‌భుత్వ ప‌థ‌కం ఏదో కూడా వెల్ల‌డించాల‌ని కేటీఆర్ కోరారు.


More Telugu News