పెట్రోల్ కోసం రెండు రోజుల పాటు క్యూలో వేచి ఉన్న శ్రీలంక క్రికెటర్.. ప్రాక్టీస్ కు కూడా వెళ్లలేకపోతున్నానని ఆవేదన!

  • రెండు రోజుల తర్వాత చమిక కరుణరత్నేకు దొరికిన పెట్రోల్
  • దేశ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ఆవేదన
  • ప్రజలు మంచి పాలకుడిని ఎన్నుకోవాలని వ్యాఖ్య
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభం ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ బాధితులుగానే మిగిలిపోతున్నారు. తాజా పరిస్థితిపై శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్లోకి కరుణరత్నే అడుగుపెట్టాడు. 

దేశంలోని తాజా పరిస్థితిపై కరుణరత్నే మాట్లాడుతూ, కారులో పెట్రోల్ నింపుకోవడం కోసం పెట్రోల్ బంక్ వద్ద పెద్ద క్యూలో వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపాడు. అదృష్టవశాత్తు రెండు రోజుల పాటు క్యూలో ఉన్న తర్వాత పెట్రోల్ దొరికిందని అన్నాడు. పెట్రోల్ లేకపోవడంతో ప్రాక్టీస్ కు కూడా వెళ్లలేకపోతున్నానని చెప్పాడు. 

ఈ ఏడాది ఆసియా కప్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ ఎదుర్కోలేనటువంటి ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటోంది. ఆసియా కప్ గుంచి కరుణరత్నే మాట్లాడుతూ, ఈ టోర్నీ నేపథ్యంలో తాను ప్రాక్టీస్ కోసం కొలంబోతో పాటు, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉందని, క్లబ్ సెషన్స్ లో పాల్గొనాల్సి ఉంటుందని... కానీ పెట్రోల్ లేకపోవడం వల్ల ప్రాక్టీస్ కు కూడా వెళ్లలేకపోతున్నారని చెప్పాడు. ఇప్పుడు రూ.10 వేల రూపాయలకు పెట్రోల్ దొరికిందని, ఇది రెండు, మూడు రోజుల కంటే ఎక్కువ రాదని తెలిపాడు. ఆసియా కప్ నేపథ్యంలో కావాల్సినంత ఇంధనాన్ని ప్రభుత్వం సమకూరుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. 

ప్రస్తుత సంక్షోభం గురించి తాను ఎక్కువగా మాట్లాడలేనని, ప్రస్తుత పరిస్థితి అయితే ఏమాత్రం బాగోలేదని చెప్పాడు. సరైన పాలకులు వస్తేనే దేశ పరిస్థితి బాగుపడుతుందని తెలిపాడు. ప్రజలు మంచి వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవాలని... అప్పుడు అంతర్జాతీయ సహకారంతో మళ్లీ మునుపటి పరిస్థితికి రావచ్చని చెప్పాడు.


More Telugu News