కర్ణాటక మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య‌ ఇచ్చిన ప‌రిహారం నోట్ల‌ను విసిరికొట్టిన మ‌హిళ‌... వీడియో ఇదిగో

  • బాదామి నుంచి ఎమ్మెల్యేగా సిద్ధ‌రామ‌య్య‌ ప్రాతినిధ్యం 
  • నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో న‌లుగురికి గాయాలు
  • బాధితుల‌కు రూ.50 వేల చొప్పున ప‌రిహారం అంద‌జేసిన ‌మాజీ సీఎం  
  • ప‌రిహారం అక్క‌ర్లేదు... నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న మ‌హిళ‌ 
కర్ణాటక మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌స్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా కొన‌సాగుతున్న సిద్ధ‌రామ‌య్య‌కు తాజాగా మ‌రో చేదు అనుభ‌వం ఎదురైంది. అది కూడా ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌లి ఘ‌ర్ష‌ణ‌ల్లో గాయాలైన బాధితుల‌కు సిద్ధ‌రామ‌య్య అంద‌జేసిన ప‌రిహారాన్ని బాధిత కుటుంబాల‌కు చెందిన ఓ మ‌హిళ విసిరికొట్టింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... కాంగ్రెస్ పార్టీకి చెందిన సిద్ధ‌రామ‌య్య బాగ‌ల్‌కోట్ జిల్లా ప‌రిధిలోని బాదామీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కెరూర్‌లో ఇటీవ‌ల చోటుచేసుకున్న ఘ‌ర్ష‌ణ‌ల్లో న‌లుగురు వ్య‌క్తులు గాయ‌ప‌డ్డారు. దీనిపై స‌మాచారం అందుకున్న సిద్ధ‌రామ‌య్య‌... స్థానిక ఎమ్మెల్యేగా బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు శుక్ర‌వారం కెరూర్ వ‌చ్చారు. ప‌రామ‌ర్శ సంద‌ర్భంగా న‌లుగురు బాధితుల‌కు రూ.50 వేల చొప్పున ప‌రిహారం అందించి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. 

అయితే త‌మ‌కు ఎలాంటి ప‌రిహారం అవ‌స‌రం లేద‌ని ఓ బాధిత కుటుంబానికి చెందిన మ‌హిళ సిద్ధ‌రామ‌య్య‌తో వాగ్వాదానికి దిగారు. ప‌ట్ట‌ణంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించాల‌ని, నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కారెక్క‌బోతున్న మాజీ సీఎంను కోరింది. ఆమె వాద‌న‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా ముందుకు సాగిన సిద్ధ‌రామ‌య్య తీరుపై ఆమె మ‌రింత‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ క్ర‌మంలో సిద్ధ‌రామ‌య్య కారు అలా వెళ్లిపోగా... ఆ వెనుకే వెళుతున్న సిద్ధ‌రామ‌య్య గార్డు వాహనం‌పైకి ఆమె ప‌రిహారం నోట్ల‌ను విసిరికొట్టింది.


More Telugu News