చర్మ వ్యాధులున్న వారికి దూరంగా ఉండండి.. మంకీ పాక్స్ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే వారికి కేంద్రం మార్గదర్శకాలు!

  • అనారోగ్యంతో ఉన్న వారికి దూరంగా ఉండాలని సూచన
  • ఎలుకలు, ఉడతలు, కోతులకు దూరంగా ఉండాలని హెచ్చరిక
  • మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచన 
  • కేరళలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో అప్రమత్తం
కేరళలో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదుకావడం, దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీ పాక్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే ప్రయాణికులు, విదేశాల నుంచి తిరిగి వస్తున్నవారి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. 

అనారోగ్యంతో ఉన్న వారికి దూరంగా..
  • వివిధ దేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు ప్రయాణించే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండటం మంచిదని సూచించింది. జంతు సంబంధ ఆహార పదార్థాలను వీలైనంత వరకు వినియోగించవద్దని పేర్కొంది.
  • చర్మ వ్యాధులు ఉన్న వారికి, జననేంద్రియ జబ్బులతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని.. వీలైనంత వరకు అనారోగ్యంతో బాధపడుతున్న ఎవరికైనా దూరంగా ఉండటం మంచిదని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రోగులు ఉపయోగించిన వస్త్రాలు, పడక, ఇతర వస్తువులను తాకవద్దని పేర్కొంది.
  • మంకీ పాక్స్ వైరస్ కొన్ని రకాల జంతువుల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉన్నందున వాటికీ దూరంగా ఉందాలని.. ముఖ్యంగా ఎలుకలు, ఉడతలు, కోతులు, చింపాంజీలను తాకవద్దని పేర్కొంది. ఆఫ్రికాకు చెందిన అడవి జంతువుల మాంసంతో రూపొందిన ఆహార పదార్థాలు, ఉత్పత్తులకూ దూరంగా ఉండాలని హెచ్చరించింది.
  • ఎక్కడైనా, ఎవరికైనా మంకీ పాక్స్ తరహా లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నా, అలాంటి లక్షణాలు ఉన్న వారికి దగ్గరగా ఉన్నా.. వెంటనే ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోవాలని తెలిపింది.
  • దేశంలో మంకీ పాక్స్‌ లక్షణాలున్న వారి శాంపిళ్లను పరిశీలించి, పాజిటివ్  కేసులను గుర్తించేందుకు 15 డయాగ్నస్టిక్‌ కేంద్రాలను సిద్ధం చేసినట్టు ఐసీఎంఆర్‌ ప్రకటించింది.



More Telugu News