వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే అమృతం.. నీరు!

  • శరీరానికి నీటి శాతం ఎంతో అవసరం
  • జీవక్రియలు సాఫీగా సాగాలంటే నీరు తగ్గకూడదు
  • తాగితే ఎంత ఆరోగ్యమో.. తాగకపోతే అన్ని సమస్యలు
  • తగినంత నీటి పరిమాణంతో చర్మం ఆరోగ్యవంతం
మనిషి ఆహారం లేకుండా కొన్ని రోజుల పాటు జీవించగలడు. కానీ, నీరు లేకుండా.. ఎక్కువ రోజుల పాటు ప్రాణాలతో ఉండడం అసాధ్యం. జలం ప్రాణాధారం. శరీరంలో జీవక్రియలకు నీరు తప్పనిసరి. ఒక వ్యక్తి రోజువారీగా తీసుకునే నీటి పరిమాణం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందనడంలో సందేహం లేదు. 

తగినంత నీరు తాగే వారి చర్మం కాంతివంతంగా ఉంటుంది. రోజులో కనీసం 2 లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగితేనే ఫలితాలు కనిపిస్తాయి. ‘‘శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవడం వల్ల చర్మం ఎలాస్టిసిటీ (రబ్బరు మాదిరి) అలాగే కొనసాగుతుంది. దీంతో వృద్ధాప్యపు ఛాయలు పెద్దగా కనిపించవు’’ అన్నది నిపుణుల సూచన. నీటిని తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. సరిపడా తాగకపోవడం వల్ల అనర్థాలు కూడా అన్నే ఉన్నాయి. నీరు తగ్గితే బరువు పెరుగుతారు. కోపం వస్తుంటుంది. శక్తి చాలనట్టుగా ఉంటారు. చర్మం త్వరగా ముడతలు పడిపోతుంది. 

మన శరీరంలో 60 శాతం నీరే. శరీరంలో ఎన్నో క్రియలకు నీరు కావాలి. శరీర ఉష్ణోగ్రత నిర్వహణ, శక్తి, జాయింట్లలో మృదుత్వం, హార్మోన్ల సాఫీ పనితీరు, పోషకాలు శరీరం అంతటికి అందడానికి నీరు కీలకం. అందుకని నీరు తగినంత తాగాలి. పుష్కలంగా తాగే వారికి వృద్ధాప్యపు ఛాయలు కొంత ఆలస్యంగానే కనిపిస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు తెలుపుతున్నాయి.

కేవలం నీరు తీసుకుంటే వృద్ధాప్యం ఆలస్యం అవుతుందా? అంటే కాదన్నదే సమాధానం. తీసుకునే ఆహారం, జీవన శైలి, ఇతర ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వృద్ధాప్యాన్ని నిర్ణయిస్తాయి. కాకపోతే అవన్నీ సరిగ్గా ఉండి, నీరు తగినంత లేకపోతే నష్టం జరుగుతుంది. కనుక వృద్ధాప్యపు ఛాయలు త్వరగా కనిపించకుండా, యవ్వనంగా, ఉత్సాహంగా ఉండడంలో నీరు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలుసుకోవాలి. 

నీటితోపాటు, తీసుకునే ఇతర ద్రవపదార్థాలు కూడా మొత్తం పరిమాణం కిందకు వస్తాయి. ఉదాహరణకు నిమ్మరసం, ఇతర పళ్ల రసాలు, కొబ్బరి నీరు. ఇలా రోజు మొత్తం మీద తీసుకునే ద్రవ పదార్థాల పరిమాణం 2-3 లీటర్ల వరకు కనీసం ఉండేలా చూసుకుంటే చాలు.


More Telugu News