నా సంపద అంతా సమాజానికే ఇచ్చేస్తా..: బిల్ గేట్స్ సంచలన ప్రకటన
- తన కుటుంబ సభ్యుల జీవనానికి సరిపడా చాలన్న బిలియనీర్
- మిగిలినదంతా సమాజానికే ఇచ్చేస్తానన్న బిల్ గేట్స్
- ఇది త్యాగం కాదు.. బాధ్యత అంటూ ప్రకటన
- మరెంతో మంది సంపన్నులు ముందుకు వస్తారన్న ఆకాంక్ష
సామాజిక సేవా కార్యక్రమాల కోసం తాజాగా 20 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.60 లక్షల కోట్లు) విరాళం ప్రకటించి ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ తన ఉదారతను చాటుకున్నారు. అంతటితో ఆయన ఆగిపోలేదు. తన జీవనానికి, తన కుటుంబ సభ్యుల జీవనానికి కావాల్సింది పోను, మిగిలిన తన యావత్ సంపదను కూడా సమాజానికే ఇచ్చేస్తానని బిల్ గేట్స్ ప్రకటించారు.
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ ఐదో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద విలువ 103 బిలియన్ డాలర్లు (రూ.8.13 లక్షల కోట్లు). తన మాజీ భార్య మిలిందాతో కలసి ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో (భారత్ కూడా) ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
‘‘నేను ఇస్తున్న ఈ విరాళం త్యాగం కాదు. గొప్ప సవాళ్లను ఎదుర్కోవడంలో భాగస్వామ్యం అవుతున్నానని గర్వంగా ఉంది. నేను పనిని ఆస్వాదిస్తాను. ప్రజల జీవన ప్రమాణాలను గొప్పగా ప్రభావితం చేసే స్థాయిలో నా వనరులను సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రపంచంలో గొప్ప సంపద కలిగిన ఇతరులు సైతం ఈ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను’’ అని బిల్ గేట్స్ తన బ్లాగ్ లో పేర్కొన్నారు.
తాజాగా ప్రకటించిన 20 బిలియన్ డాలర్ల విరాళాన్ని బిల్ గేట్స్ ఈ నెలలోనే తన ఫౌండేషన్ కు బదలాయించనున్నారు. ప్రస్తుతం ఏటా ఈ ఫౌండేషన్ తరఫున 6 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తుండగా, 2026 నాటికి 9 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్నది ఆయన లక్ష్యం.