‘నయాగర ఫాల్స్’ వంటి అద్భుత జలపాతం కర్ణాటకలో.. వీడియో ఇదిగో!

  • చూపరులను కట్టిపడేస్తున్న షిమోగ జిల్లాలోని జాగ్ ఫాల్స్
  • ట్విట్టర్లో షేర్ చేసిన విదేశీయుడు ఎరిక్ సోల్హిమ్
  • మరిన్ని జలపాతాల వివరాలతో స్పందిస్తున్న నెటిజన్లు
ఈ ప్రపంచంలో అత్యంత సుందర జలపాతం ఏది? అని అడిగితే నయాగర ఫాల్స్ గుర్తుకు వస్తాయి. అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఉన్న ఈ అందాలను చూడ్డం అందరికీ సాధ్యపడదు. మరి నయాగరాను మించి అందాలు ఒలకబోస్తూ, వయ్యారంగా సాగిపోయే అద్భుత జలపాతాన్ని చూడడానికి మరీ అంత దూరం వెళ్లక్కర్లేదు. మనకు సమీపంలోని కర్ణాటక రాష్ట్రంలో షిమోగా జిల్లాకు వెళ్లగలిగితే చాలు. అక్కడి జాగ్ ఫాల్స్ చూపరులను ఇట్టే కట్టి పడేస్తాయి.

చుట్టూ ఎత్తయిన కొండల మధ్య నుంచి వచ్చే ఈ జలపాతం పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశం. దీన్ని ఓ విదేశీయుడు, గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిస్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్హిమ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘ఇది నయాగరా ఫాల్స్ కాదు. జాగ్ ఫాల్స్. భారత్ లోని కర్ణాటక రాష్ట్రం, షిమోగా జిల్లాలో ఉంది. అద్భుతమైన వీడియో చూడండి’’ అంటూ సోల్హిమ్ ట్వీట్ చేశారు. 

దీనికి నెటిజన్లు చక్కగా స్పందిస్తున్నారు. భారత్ లోనే దాగి ఉన్న ఇతర సుందర జలపాతాల వివరాలను పోస్ట్ చేస్తున్నారు. కేరళలోని త్రిసూర్ జిల్లా అత్తిరప్పిల్లి జలపాతాలను మర్చిపోవద్దంటూ ఓ యూజర్ ట్వీట్ చేశాడు. ఓ యూజర్ వరంగల్ జిల్లా పరిధిలోని బోగత జలపాతం వివరాలను సైతం పోస్ట్ చేశాడు.


More Telugu News