ఈ సారి చాహ‌ల్ వంతు!... 49 ఓవ‌ర్ల‌లోనే ఇంగ్లండ్ ఆలౌట్‌!

  • బంతితో మ్యాజిక్ చేసిన చాహ‌ల్‌
  • 4 కీల‌క వికెట్ల‌ను నేల‌కూల్చిన స్పిన్న‌ర్‌
  • 2 వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తా చాటిన పాండ్యా
  • 246 ప‌రుగులు చేసిన ఇంగ్లండ్‌
ఇంగ్లండ్ టూర్‌లో స‌త్తా చాటుతున్న టీమిండియా వ‌న్డే సిరీస్‌లో భాగంగా గురువారం జ‌రుగుతున్న రెండో వన్డేలోనూ రాణించింది. తొలి వ‌న్డేలో ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా చెల‌రేగ‌గా... రెండో వ‌న్డేలో స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ బంతితో మాయ చేశాడు. చాహ‌ల్‌కు బుమ్రా, హార్దిక్ ప్యాండ్యా జ‌త క‌ల‌వడంతో పూర్తిగా 50 ఓవ‌ర్లు ఆడ‌కుండానే ఆతిథ్య జ‌ట్టు చేతులెత్తేసింది. అయితే తొలి రోజు స‌గం ఓవ‌ర్ల‌కే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ జ‌ట్టు రెండో వ‌న్డేలో మాత్రం 49 ఓవ‌ర్ల‌ వ‌ర‌కు బ్యాటింగ్ చేయ‌గ‌లిగింది. 39 ఓవ‌ర్ల‌లో ఇంగ్లండ్ జ‌ట్టు 246 ప‌రుగులు చేసింది.

మ‌రికాసేప‌ట్లో 247 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో టీమిండియా త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బౌలింగ్ ఎంచుకోగా... చాహ‌ల్‌, పాండ్యా త‌మ‌దైన శైలి బౌలింగ్‌తో మ్యాజిక్ చేశారు. చాహ‌ల్ పూర్తిగా 10 ఓవ‌ర్ల పాటు బౌలింగ్ చేసి 47 ప‌రుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అదే స‌మ‌యంలో 6 ఓవ‌ర్లు మాత్ర‌మే వేసిన పాండ్యా 28 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్ల‌ను నేల‌కూల్చాడు. తొలుత వికెట్లు తీయ‌డానికి క‌ష్ట‌ప‌డ్డ బుమ్రా... చివ‌ర్లో 2 వికెట్లు తీశాడు. బుమ్రా మొత్తం 10 ఓవ‌ర్ల పాటు బౌలింగ్ చేసి ఓ మైడెన్ ఓవ‌ర్‌తో పాటు 2 వికెట్లు తీసి 49 ప‌రుగులు ఇచ్చాడు. ఇక మ‌హ్మ‌ద్ ష‌మీ, ప్ర‌సిద్ధ కృష్ణ‌లు చెరో వికెట్ తీశారు. 

ఇంగ్లండ్ బ్యాటింగ్ తొలుత కుదురుకున్న‌ట్లుగానే క‌నిపించినా.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా వికెట్లు ప‌డ‌టంతో భారీ స్కోరు చేయ‌లేక‌పోయింది. 8 ఓవ‌ర్ల దాకా వికెట్ ప‌డ‌కుండా కాపాడుకున్న ఇంగ్లండ్ ఓపెన‌ర్‌ జేస‌న్ రాయ్‌(23)ను పాండ్యా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో (38)ని చాహ‌ల్ అవుట్ చేశాడు. త‌ద‌నంత‌రం స్వ‌ల్ప స్కోర్ల‌కే జో రూట్ (11), జాస్ బ‌ట్ల‌ర్ (4)లు వెనుదిరిగారు. కుదురుకున్న‌ట్లుగానే క‌నిపించిన బెన్ స్టోక్స్ (21), లివింగ్ స్టోన్ (33)లు కూడా వెంట‌వెంట‌నే అవుట్ అయ్యారు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన మొయిన్ అలీ (47) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దేందుకు య‌త్నించినా వ‌రుస‌గా వికెట్లు ప‌డ‌టంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 49 ఓవ‌ర్లు పూర్తయ్యేస‌రికి 246 ప‌రుగుల వ‌ద్ద ముగిసింది.


More Telugu News