మాల్దీవుల నుంచి సింగపూర్ కు జంప్ అయిన గొటబాయ రాజపక్స.. కీలక ప్రకటన చేసిన సింగపూర్!

  • గొటబాయ ఆశ్రయం కోరలేదన్న సింగపూర్
  • తాము కూడా ఆశ్రయం ఇవ్వలేదని స్పష్టీకరణ
  • గొటబాయది వ్యక్తిగత పర్యటన మాత్రమేనన్న సింగపూర్
శ్రీలంక నుంచి మాల్దీవులకు పారిపోయిన ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స... అక్కడి నుంచి సింగపూర్ కు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన తమ దేశంలో ల్యాండ్ అవుతారనే సమయంలో సింగపూర్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గొటబాయ రాజపక్స సింగపూర్ కు వస్తుండటం పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గొటబాయకు సింగపూర్ ఆశ్రయం ఇవ్వలేదని స్పష్టం చేసింది. 

కేవలం ప్రైవేట్ పర్యటనకు మాత్రమే గొటబాయకు అనుమతిని ఇచ్చినట్టు సింగపూర్ తెలిపింది. ఆశ్రయం కల్పించాలని తమను గొటబాయ కోరలేదని... తాము కూడా ఆయనకు ఆశ్రయాన్ని ఇవ్వలేదని చెప్పింది. తమకు ఆశ్రయం కల్పించాలంటూ వచ్చే విన్నపాలను సింగపూర్ సాధారణంగా స్వీకరించదని తెలిపింది.  

మరోవైపు సౌదీ ఎయిర్ లైన్స్ విమానంలో ఈ మధ్యాహ్నం సింగపూర్ లో గొటబాయ ల్యాండ్ అయ్యారు. ఆయన కొన్ని రోజుల పాటు సింగపూర్ లోనే ఉంటారని సమాచారం. ఆ తర్వాత యూఏఈకి వెళ్లి, అక్కడ ఆశ్రయం పొందుతారని వార్తలొస్తున్నాయి.


More Telugu News