ఏపీ మునిసిప‌ల్ కార్మికుల వేత‌నం రూ.21 వేల‌కు పెంపు.. స‌మ్మె విర‌మించాల‌ని మంత్రి సురేశ్ పిలుపు

  • 4 రోజులుగా కొన‌సాగుతున్న మునిసిప‌ల్ కార్మికుల‌ సమ్మె
  • సీఎం జ‌గ‌న్‌తో మంత్రుల క‌మిటీ భేటీ
  • వేత‌నాన్ని రూ.21 వేల‌కు పెంచుతున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌
  • ప్ర‌ధాన డిమాండ్లు ప‌రిష్కార‌మ‌య్యాయ‌న్న మంత్రి సురేశ్
ఏపీలో 4 రోజులుగా కొన‌సాగుతున్న మునిసిప‌ల్ కార్మికుల స‌మ్మెపై రాష్ట్ర ప్ర‌భుత్వం గురువారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స‌మ్మె విర‌మ‌ణ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్న సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌తో రంగంలోకి దిగిన మంత్రుల క‌మిటీ కార్మిక సంఘాల నేత‌ల‌తో ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిపింది. తాజాగా గురువారం మంత్రులు ఆదిమూల‌పు సురేశ్, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డిలు సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. కార్మికుల డిమాండ్లు, వాటి ప‌రిష్కారంపై తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను జ‌గ‌న్‌కు మంత్రులు వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా కార్మికుల హెల్త్ అల‌వెన్స్ కోసం ఇస్తున్న‌ రూ.6 వేల‌ను అలాగే కొన‌సాగిస్తూ కార్మికుల వేత‌నాన్ని రూ.21 వేల‌కు పెంచాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. జ‌గ‌న్‌తో చర్చ‌ల అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన మంత్రి సురేశ్ మీడియాతో మాట్లాడారు. హెల్త్ అల‌వెన్స్‌, వేత‌నాల‌కు సంబంధించిన కార్మికుల ప్ర‌ధాన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. మిగిలిన డిమాండ్ల‌పై త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న వివ‌రించారు. ప్ర‌ధాన డిమాండ్లు ప‌రిష్కారం అయిన నేప‌థ్యంలో శుక్ర‌వారం నుంచి కార్మికులు విధుల‌కు హాజ‌రు కావాల‌ని ఆయ‌న కోరారు. అయితే మంత్రి ప్ర‌క‌ట‌న‌పై కార్మికులు ఇంకా స్పందించ‌లేదు.


More Telugu News