టీడీపీ ప్రాంతీయ పార్టీ, జనసేన గుర్తింపు లేని పార్టీ!... అంటూ ఈసీ వార్త‌ను పోస్ట్ చేసిన విజ‌య‌సాయిరెడ్డి!

  • దేశ‌వ్యాప్తంగా 8 పార్టీల‌కే జాతీయ హోదా
  • 27 రాష్ట్రాల్లో 57 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయ‌న్న ఈసీ
  • టీడీపీ స‌హా వైసీపీ, టీఆర్ఎస్ కూడా ప్రాంతీయ పార్టీలేన‌ని వెల్ల‌డి
  • గుర్తింపు లేని పార్టీలు 2,795 ఉన్నాయ‌ని ప్ర‌క‌ట‌న‌
  • అందులో జ‌న‌సేన కూడా ఉంద‌ని వెల్ల‌డి
  • జ‌న‌సేన గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబ‌ల్స్ లిస్టులో చేర్చిన వైనం
దేశంలో గుర్తింపు క‌లిగిన పార్టీలు... అందులో జాతీయ పార్టీలెన్ని, ప్రాంతీయ పార్టీలు ఎన్ని... అస‌లు గుర్తింపు లేకుండానే కొనసాగుతున్న పార్టీలు ఎన్ని... అవి ఏవేవి అంటూ బుధ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ఆధారంగా తెలుగు దిన ప‌త్రిక ఈనాడులో ప్ర‌చురిత‌మైన ఓ క‌థ‌నాన్ని ప్ర‌స్తావిస్తూ వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ ఒక ప్రాంతీయ పార్టీ మాత్ర‌మేనంటూ ఈసీ చెప్పిన విష‌యాన్ని హైలైట్ చేస్తూ సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. టీడీపీ ప్రాంతీయ పార్టీగా కాదు క‌దా ఉప ప్రాంతీయ పార్టీగా చెప్పుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

ఈసీ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం బీజేపీ, కాంగ్రెస్‌, తృణ‌మూల్ కాంగ్రెస్‌, బీఎస్పీ, సీసీఐ, సీపీఎం, ఎన్సీపీ, నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీలు మాత్ర‌మే జాతీయ పార్టీలుగా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ, టీఆర్ఎస్ స‌హా మ‌జ్లిస్‌, టీడీపీలు కేవ‌లం ప్రాంతీయ పార్టీలే. ఇలా దేశంలోని 27 రాష్ట్రాల్లో 57 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇక ఈసీ గుర్తింపు కూడా లేని పార్టీలు 2,796 ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ త‌న అస్తిత్వం చాటుకుంటున్న జ‌న‌సేన‌ను గుర్తింపు లేని పార్టీల జాబితాలోనే ఈసీ ఉంచేసింది. అంతేకాకుండా ఏ పార్టీకి కేటాయించ‌ని 197 గుర్తుల‌ను ఫ్రీ సింబ‌ల్స్‌గా ప్ర‌క‌టించిన ఈసీ... అందులో జ‌న‌సేన గుర్తు గాజు గ్లాస్‌ను కూడా చేర్చింది.


More Telugu News