పన్ను ఆదా.. మెరుగైన రాబడినిచ్చే ఫిక్స్ డ్ డిపాజిట్

  • సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు
  • ఐదేళ్ల పాటు లాకిన్ ఉండే డిపాజిట్ ఇది
  • వడ్డీ ఆదాయం మాత్రం పన్ను పరిధిలోకి..
ఫిక్స్ డ్ డిపాజిట్.. రాబడి తక్కువే అయినా ఎక్కువ మంది పెట్టుబడి పెట్టుకునేందుకు నమ్మకమైన సాధనం. మరీ ముఖ్యంగా చిన్న మదుపరులకు విశ్వసనీయమైనది. అయితే, ఫిక్స్ డ్ డిపాజిట్ తో పన్ను ఆదా చేసుకునే మార్గం కూడా ఉంది.

సాధారణంగా ఎఫ్ డీల నుంచి వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. సేవింగ్స్ డిపాజిట్, ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 వరకు (60 ఏళ్లలోపు వారికి) ఉంటే పన్ను పడదు. అంతకు మించితే పన్ను కట్టాలి.

అన్ని బ్యాంకుల్లోనూ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్ డ్ డిపాజిట్ అందుబాటులో ఉంది. వడ్డీని ఎప్పటికప్పుడు చెల్లించాలా? లేక అసలుకు కలిపి చివర్లో చెల్లించాలా? వీటిల్లో నచ్చిన ఆప్షన్ ను ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఐదేళ్ల వరకు పన్ను ఆదా ఫిక్స్ డ్ డిపాజిట్ వెనక్కి తీసుకోవడం కుదరదు. 

డీసీబీ బ్యాంకు అత్యధికంగా 6.6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. వడ్డీని ప్రతీ త్రైమాసికానికి అసలుకు కలుపుతారు. ఇండస్ ఇండ్ బ్యాంకు 6.5 శాతం, ఆర్ బీఎల్ బ్యాంకు 6.3 శాతం, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు 6 శాతం, కరూర్ వైశ్యా బ్యాంకు 5.9 శాతం చొప్పున పన్ను ఆదా ఫిక్స్ డ్ డిపాజిట్ పై చెల్లిస్తున్నాయి. 

ఇతర ఎఫ్ డీల మాదిరే పన్ను ఆదా ఫిక్స్ డ్ డిపాజిట్ల వడ్డీ ఆదాయం కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. పన్ను చెల్లింపుదారు ఇతర ఆదాయం రూపంలో దీన్ని రిటర్నుల్లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ పన్ను ఆదా ఫిక్స్ డ్ డిపాజిట్ అంటే సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలను ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు.


More Telugu News