రణిల్‌ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు.. సింగపూర్ ఫ్లైట్ కోసం మాల్దీవుల్లో గొటబాయ ఎదురుచూపులు

  • శ్రీలంకలో కొనసాగుతున్న ఆందోళన
  • రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా అంగీకరించబోమంటున్న నిరసనకారులు
  • స్పీకర్ చెబుతున్నా పట్టించుకోని వైనం
  • ఆందోళనల్లో 26 ఏళ్ల యువకుడి మృతి
శ్రీలంకలో సంక్షోభానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. రాజీనామాకు అంగీకరించని అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. అయితే, రణిల్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రతిపక్షాలు అంగీకరించడం లేదు. 

మరోవైపు, నిరసనకారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజపక్స ఎంపిక చేసిన విక్రమసింఘే దేశ వ్యవహారాలకు సారథ్యం వహించడం ఇష్టంలేదని తేల్చి చెబుతున్నారు. రాజపక్స సోమవారం రాజీనామా చేస్తారని స్పీకర్ మహింద యాపా అబేవర్ధనె చెప్పినా లెక్కచేయడం లేదు. ఈ నెల 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఆయన తెలిపారు. 

ఇదిలావుంచితే, దేశం నుంచి మాల్దీవులకు పరారైనా అక్కడా నిరసన సెగలు చుట్టుముట్టడంతో గొటబాయ సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మాల్దీవుల నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఓ ప్రైవేట్‌ ఫ్లైట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇంకోవైపు, శ్రీలంకలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఓ సైనికాధికారి నుంచి నిరసనకారులు పెద్ద తుపాకి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పోల్దువా జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగిందని, ఆర్మీ అధికారి నుంచి టి-56 తుపాకి, 60 బులెట్లతో కూడిన రెండు మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఆందోళనకారులపై పోలీసులు సీఎస్ గ్యాస్ ప్రయోగించడంతో 26 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.


More Telugu News