అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో అగ్ర‌స్థానానికి ఎగ‌బాకిన బుమ్రా

  • నిన్న‌టిదాకా 4వ ర్యాంకులో ఉన్న బుమ్రా
  • ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చిన బౌల‌ర్‌
  • 7.2 ఓవర్ల‌లో 18 ప‌రుగులిచ్చి 6 వికెట్లు తీసిన భార‌త క్రికెట‌ర్‌
  • ట్రెంట్ బౌల్ట్‌ను కింద‌కు నెట్టేసి టాప్‌లో కూర్చున్న జ‌స్‌ప్రీత్‌
వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యుత్త‌మ బౌలింగ్ గ‌ణాంకాల‌ను న‌మోదు చేసిన టీమిండియా బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా... ఆ ఒక్క ప్ర‌ద‌ర్శ‌న‌తోనే వ‌న్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానానికి చేరిపోయాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధ‌వారం విడుద‌ల చేసిన ర్యాంకింగ్స్‌లో వ‌న్డే బౌల‌ర్ల‌లో బుమ్రా నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిలిచాడు. మంగ‌ళ‌వారం ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో 7.2 ఓవ‌ర్లు వేసిన బుమ్రా... 3 మైడెన్ ఓవ‌ర్ల‌తో పాటు కేవ‌లం 19 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఏకంగా 6 వికెట్ల‌ను ప‌డ‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. బుమ్రా ప‌డ‌గొట్టిన 6 వికెట్ల‌లో 3 డ‌క్ అవుట్లు ఉన్నాయి. వ‌న్డేల్లో బుమ్రాకు ఇదే అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌గా నిలిచింది.

నిన్న‌టి మ్యాచ్‌కు ముందు వ‌న్డే బౌలింగ్ ర్యాంకుల్లో బుమ్రా 4వ స్థానంలో ఉన్నాడు. అగ్ర స్థానంలో ఇంగ్లండ్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. అయితే నిన్న‌టి మ్యాచ్‌తో ఒక్క‌సారిగా మూడు స్థానాలు ఎగ‌బాకిన బుమ్రా... అగ్ర‌స్థానంలో ఉన్న బౌల్ట్‌ను రెండో స్థానానికి నెట్టేశాడు. ప్ర‌స్తుతం 718 పాయింట్ల‌తో బుమ్రా టాప్‌లో ఉండ‌గా... 712 పాయింట్ల‌తో బౌల్ట్ రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. వ‌న్డే బౌలింగ్ టాప్ టెన్‌లో అగ్ర‌స్థానంలో నిలిచిన బుమ్రా మిన‌హా మరే భార‌త బౌల‌ర్ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.


More Telugu News