నేను టీవీలో చిరంజీవి పాటలు చూస్తుంటే కోహ్లీ డ్యాన్స్ చేసేవాడు: మాజీ రంజీ ఆటగాడు రవితేజ

  • ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ
  • కోహ్లీని కలిసిన రవితేజ
  • అండర్-15 రోజులను గుర్తుచేసుకున్న వైనం
  • కోహ్లీని చూడడం ఆనందంగా ఉందని వెల్లడి
డీబీ రవితేజ... కాకినాడకు చెందినవాడైనా, హైదరాబాద్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. కొన్నాళ్ల కిందట ఆటకు వీడ్కోలు పలికాడు. దేశవాళీ క్రికెట్లో ప్రతిభావంతుడైన బ్యాట్స్ మన్ గా గుర్తింపు పొందిన రవితేజ గతంలో డెక్కన్ చార్జర్స్ తరఫున ఐపీఎల్ ఆడాడు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న అనేకమంది రవితేజ సమకాలికులే. వారిలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఒకడు. 

తాజాగా రవితేజ ట్విట్టర్ లో ఆసక్తికర అంశం వెల్లడించాడు. ఆరేళ్ల తర్వాత తాను ఇంగ్లండ్ లో కోహ్లీని కలిశానని తెలిపాడు. కోహ్లీ తనను చూడగానే మొదట "చిరు ఎలా ఉన్నావ్?" అని అడిగాడని చెప్పాడు. అసలు 'చిరు' అని తనను ఎందుకు పిలవాల్సి వచ్చిందో కూడా రవితేజ వివరించాడు. 

అండర్-15 క్రికెట్ ఆడే సమయంలో కోహ్లీ, తాను ఒకే రూములో ఉండేవారమని తెలిపాడు. ఆ సమయంలో తాను టీవీలో చిరంజీవి పాటలు చూస్తుంటే, ఆ పాటలకు కోహ్లీ డ్యాన్స్ చేసేవాడని రవితేజ వెల్లడించాడు. అప్పటినుంచి ఒకరినొకరం 'చిరు' అని పిలుచుకునేవాళ్లమని వివరించాడు. ఈ మేరకు రవితేజ ట్విట్టర్ లో స్పందించాడు. "నిన్ను చూడడం చాలా ఆనందంగా ఉంది చిరు" అంటూ కోహ్లీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అంతేకాదు, కోహ్లీతో ఇంగ్లండ్ లో తాను దిగిన ఫొటోలను కూడా పంచుకున్నాడు.


More Telugu News