మస్క్ ను కోర్టుకు ఈడ్చిన ట్విట్టర్ 

  • ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ ను ఆదేశించాలని వినతి
  • ఒక్కో షేరును 54.20 డాలర్లు చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్
  • డెలావేర్ కోర్టులో పిటిషన్ వేసిన ట్విట్టర్ యాజమాన్యం
ఒక్కో షేరుకు 54.20 డాలర్లు చెల్లించి మరీ ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానంటూ తెగ ఉత్సాహం ప్రదర్శించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారు. ట్విట్టర్ ను కొనుగోలు చేయడం లేదని ప్రకటించేశారు. దీంతో ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ యాజమాన్యం డెలావేర్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. మస్క్ ప్రకటించినట్టుగానే ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.

దీనిపై మస్క్ స్పందించారు. ‘‘నేను ట్విట్టర్ ను కొనుగోలు చేయడం లేదని వారు చెప్పారు. వారి దగ్గర ఉన్న బోట్ సమాచారం ఇవ్వడం లేదు. ఇప్పుడు వారు నన్ను ట్విట్టర్ ను కొనుగోలు చేసేలా బలవంతం చేసేందుకు కోర్టుకు వెళ్లారు. కనుక వారు కోర్టులో అయినా బోట్ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది’’ అని మస్క్ పేర్కొన్నారు.

 ట్విట్టర్ వేదికపై ఎక్కువ నకిలీ ఖాతాలున్నట్టు మస్క్ ఆరోపిస్తున్నారు. యాజమాన్యం చెప్పిన దానికి మించి బోట్ (కంప్యూటర్ ప్రోగ్రామ్) ఆధారితంగా నడిచే నకిలీ ఖాతాలు ఎన్ని ఉన్నాయనేది కచ్చితంగా తేల్చాలని కోరారు. ఇందుకు ఆధారాలు కూడా అడిగారు. కానీ, ట్విట్టర్ ఈ అంశంలో తగినంత సమాచారం ఇవ్వలేకపోయింది.


More Telugu News