అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను తొలగించేందుకు రంగం సిద్ధం

  • సరెండర్ లీవులు, అదనపు సరెండర్‌ల లీవుల మొత్తాన్ని ఇవ్వాలంటూ ప్లకార్డు ప్రదర్శన
  • తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు
  • పాత కేసుల్లో అభియోగాలు రుజువయ్యాయంటూ నోటీసులు
  • ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఒకటి రెండు రోజుల్లో ఆదేశాలు!
సరెండర్ లీవులు, అదనపు సరెండర్‌ల లీవులకు సంబంధించిన మొత్తం ఇప్పించాలంటూ ఇటీవల ప్లకార్డు ప్రదర్శించిన అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కె.ప్రకాశ్ ‌ను ఉద్యోగం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. గత నెల 14న సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో సీఎం జగన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా పోలీసుల అమరవీరుల స్తూపం వద్ద ప్రకాశ్ ప్లకార్డుతో నిరసన తెలిపాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆయన గతంలో ఉన్న పాత కేసులు తిరగదోడి వేటు వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

గార్లెదిన్నెకు చెందిన ఓ వివాహితను పెళ్లి పేరుతో మోసగించడంతోపాటు ఆమె నుంచి డబ్బు, బంగారం కాజేసిన ఆరోపణలపై 2019 జులైలో గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌లో ప్రకాశ్ ‌పై కేసు నమోదైంది. కానిస్టేబుల్ నిరసన ప్రదర్శన తర్వాత జూన్ 17న ఈ కేసులో శాఖాపరమైన విచారణ నిర్వహించిన అధికారులు అభియోగం రుజువైందంటూ తాజాగా ఆయనకు నోటీసు ఇచ్చారు. అలాగే, 2014లో కదిరిలో నమోదైన మరో కేసులోనూ ఈ నెల అదే నెల 18, 19 తేదీల్లో శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఈ కేసులోనూ అతడిపై నమోదైన అభియోగాలు నమోదైనట్టు పేర్కొన్న అధికారులు అతడిపై చర్యలకు సిఫార్సు చేశారు. 

ఈ నేపథ్యంలో అతడిని ఉద్యోగం నుంచి తొలగించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ఆదేశాలు జారీ కానున్నట్టు తెలుస్తోంది. అలాగే, ప్రకాశ్ బ్యాంకు లావాదేవీలతోపాటు అతడి కదలికలపైనా స్పెషల్ బ్రాంచి పోలీసులు నిఘా పెట్టినట్టు సమాచారం. ప్రకాశ్ పై నమోదైన కేసుల్లో అభియోగాలు రుజువయ్యాయని, ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.


More Telugu News