వికెట్ ప‌డ‌కుండా విక్ట‌రీ కొట్టిన టీమిండియా!... ఇంగ్లండ్ పేరిట చెత్త రికార్డు!

  • 18.4 ఓవ‌ర్ల‌లో 114 ప‌రుగులు చేసిన భార‌త్‌
  • హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌
  • సిరీస్‌లో 1-0 ఆధిక్య‌త‌ను సాధించిన టీమిండియా
  • భార‌త్‌పై ఇంగ్లండ్‌కు అతి త‌క్కువ స్కోరు ఇదే
ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా మ‌రో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాన్ని న‌మోదు చేసింది. 3 మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా మంగ‌ళ‌వారం తొలి వ‌న్డేలో టీమిండియా రికార్డు విక్ట‌రీ న‌మోదు చేసింది. ఆతిథ్య జ‌ట్టు నిర్దేశించిన అతి స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని వికెట్ న‌ష్ట‌పోకుండానే (10 వికెట్ల తేడాతో) టీమిండియా ఛేదించింది. కేవలం 18.4 ఓవ‌ర్ల‌లోనే ఇంగ్లండ్ నిర్దేశించిన 110 ల‌క్ష్యాన్ని రోహిత్ శ‌ర్మ సేన తుత్తునియ‌లు చేసింది. తొలుత బంతితో, ఆపై బ్యాటుతో చెల‌రేగిపోయిన టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.

టీమిండియా బ్యాటింగ్‌ను ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (58 బంతుల్లో 76 ప‌రుగులు) చేసి అజేయంగా నిలిచాడు. రోహిత్‌కు జ‌త‌గా వ‌చ్చిన శిఖ‌ర్ ధావన్‌ (31) నిల‌క‌డ‌గా రాణించి వికెట్ ప‌డిపోకుండా జాగ్ర‌త్త‌గా ఇన్నింగ్స్‌ను కాపాడాడు. రోహిత్ ధాటిగా ఆడుతుండ‌గా...ధావ‌న్ మాత్రం రొటేట్ చేస్తూ రోహిత్‌కు స‌హ‌కారం అందించాడు. వెర‌సి 18.4 ఓవ‌ర్ల‌లోనే వీరిద్ద‌రూ 114 ప‌రుగులు చేసి భార‌త్‌కు రికార్డు విజ‌యాన్ని అందించారు.

ఇదిలా ఉంటే.. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ చెత్త రికార్డును న‌మోదు చేసుకుంది. భార‌త ఫాస్ట్ బౌల‌ర్లు జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ ష‌మీల బంతుల‌కు బెంబేలెత్తిపోయి అతి త‌క్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యారు. 25.2 ఓవ‌ర్ల‌లోనే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ కేవ‌లం 110 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. భార‌త్‌పై ఇంగ్లండ్‌కు అతి త‌క్కువ స్కోరు ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.


More Telugu News