ప్ర‌త్య‌ర్థి వెన్ను విరిచిన బుమ్రా... 25.2 ఓవ‌ర్ల‌కే కుప్ప‌కూలిన ఇంగ్లండ్‌

  • 110 ప‌రుగులకే ఆలౌట్ అయిన ఆతిథ్య జ‌ట్టు
  • బుమ్రా ఖాతాలో 6 వికెట్లు
  • డ‌కౌట్లుగా న‌లుగురు ఇంగ్లండ్ బ్యాట‌ర్లు
  • వాటిలో మూడు డ‌కౌట్లు బుమ్రావే
  • భార‌త విజ‌య‌ల‌క్ష్యం 111 ప‌రుగులు
ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియా స‌త్తా చాటుతోంది. ఇప్ప‌టికే టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త జ‌ట్టు... తాజాగా మంగ‌ళ‌వారం నాటి వ‌న్డేలో ప‌ట్టు బిగించింది. భార‌త ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా దెబ్బ‌కు ఇంగ్లండ్ జ‌ట్టు బ్యాట‌ర్లు బెంబేలెత్తిపోయారు. కేవ‌లం 7.2 ఓవ‌ర్లు మాత్ర‌మే చేసిన బుమ్రా...ఏకంగా 6 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. 

ఆది నుంచి ప‌దునైన బంతుల‌తో విరుచుకుప‌డ్డ బుమ్రా... ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌కు ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా వ‌రుస‌గా వికెట్లు తీశాడు. బుమ్రా దెబ్బ‌కు 25.2 ఓవ‌ర్ల‌లోనే ఇంగ్లండ్ జ‌ట్టు 110 ప‌రుగులు చేసి ఆలౌట్ అయ్యింది. మ‌రికాసేప‌ట్లో 111 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో టీమిండియా త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుంది.

3 మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. లండ‌న్‌లోని ఓవ‌ల్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో ఫ‌స్ట్ బౌలింగ్ ఎంచుకుని రోహిత్ శ‌ర్మ మంచి నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని ఆ వెంట‌నే బుమ్రా నిరూపించాడు. త‌న స్సెల్‌లో తొలి ఓవ‌ర్‌, ఓవ‌రాల్‌గా రెండో ఓవ‌ర్‌లో బుమ్రా ఏకంగా 2 కీల‌క వికెట్లు తీసి...ఇంగ్లండ్ ఓపెన‌ర్ల‌ను పెవిలియ‌న్ పంపాడు. ఆ త‌ర్వాత కూడా బుమ్రా త‌న ప్ర‌తాపాన్ని త‌గ్గించ‌లేదు. వ‌రుస‌గా వికెట్లు తీసిన బుమ్రా... కేవ‌లం 7.2 ఓవ‌ర్ల‌లోనే ఏకంగా 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను క‌కావిక‌లం చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ కూడా ఏకంగా 3 వికెట్లు తీసుకున్నాడు. ప్రిసిద్ధ కృష్ణ‌కు ఓ వికెట్ ద‌క్కింది. 

ఇక ఇంగ్లండ్ బ్యాటింగ్ విష‌యానికి వ‌స్తే... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్టార్ బ్యాట‌ర్ జాస‌న్ రాయ్ డ‌కౌట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో అత‌డు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంట‌నే జో రూట్ కూడా బుమ్రా బౌలింగ్‌లోనే వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ చేతికి దొరికిపోయాడు. రూట్ కూడా డ‌కౌట్‌గానే వెనుదిరిగాడు. లియామ్ లివింగ్‌స్టోన్‌ల‌ను కూడా బుమ్రా డ‌కౌట్‌గానే పెవిలియ‌న్ చేర్చాడు. 

మ‌రో కీల‌క బ్యాట‌ర్ బెన్ స్టోక్స్ కూడా ష‌మీ బౌలింగ్‌లో డ‌కౌట్ అయ్యాడు. ఇలా కీల‌క బ్యాటర్లంతా వ‌రుస‌గా పెవిలియ‌న్ చేరుతుండ‌టంతో ఇంగ్లండ్ శిబిరం ఆందోళ‌న‌లో కూరుకుపోయింది. జాస్ బ‌ట్ల‌ర్ (30), డేవిడ్ విల్లీ (21) డ‌బుల్ డిజిట్ స్కోరు చేయ‌డంతో ఇంగ్లండ్ ఆమాత్రం స్కోరు అయినా చేయ‌గ‌లిగింది.


More Telugu News