సౌదీ యువరాజు ఓ సైకో... సంచలన విషయాలు వెల్లడించిన మాజీ ఇంటెలిజెన్స్ అధికారి

  • గతంలో సౌదీ యంత్రాంగంలో కీలకంగా ఉన్న సాద్ 
  • అప్పటి యువరాజు నయేఫ్ కు సలహాదారుగా బాధ్యతలు
  • 2017లో నయేఫ్ తొలగింపు
  • యువరాజుగా మహ్మద్ బిన్ సల్మాన్
  • యువరాజు ఏమాత్రం కనికరంలేని వ్యక్తి అని సాద్ వెల్లడి
సౌదీ అరేబియాకు చెందిన ఓ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పై సంచలన ఆరోపణలు చేశారు. సౌదీ యువరాజు ఓ సైకో అని వెల్లడించారు. మరి కొన్నిరోజుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సౌదీ అరేబియాలో పర్యటించనున్న నేపథ్యంలో, సదరు మాజీ అధికారి ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తెరపైకి వచ్చింది. ఆ మాజీ అధికారి పేరు సాద్ అల్ జాబ్రి. ఒకప్పుడు సౌదీ ఇంటెలిజెన్స్ విభాగంలో నంబర్ 2 స్థాయిలో ఉండేవారు. 

ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మహ్మద్ బిన్ సల్మాన్ కు అపార సంపదలు ఉండడంతో, అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఓ ముప్పులా పరిణమించాడని అన్నారు. ఈ యువరాజు లెక్కలేనన్ని వనరులున్న ఓ హంతకుడు అని పేర్కొన్నారు. కిరాయి సైనికులతో 'టైగర్ స్క్వాడ్' అనే దళాన్ని కూడా నడుపుతున్నాడని, కిడ్నాపులు, హత్యలు చేయడం ఈ దళం పని అని వెల్లడించారు. 

ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని ఓ ఉన్మాది అని మహ్మద్ బిన్ సల్మాన్ ను అభివర్ణించారు. భావోద్వేగాలు లేని కఠినాత్ముడు అని, గతానుభవాల నుంచి ఏమాత్రం నేర్చుకోని మూర్ఖుడు అని సాద్ అల్ జాబ్రి వివరించారు. అతడి హత్యలకు, నేరాలకు తామే సాక్షులమని వెల్లడించారు. 

2017లో మహ్మద్ బిన్ నయేఫ్ ను సౌదీ యువరాజు పీఠం నుంచి దించివేశారు. ఆ తర్వాత మహ్మద్ బిన్ సల్మాన్ యువరాజు అయ్యారు. మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సాద్ అల్ జాబ్రి అప్పట్లో మహ్మద్ బిన్ నయేఫ్ కు సలహాదారుగానూ వ్యవహరించారు. 

ప్రవాసంలో ఉన్న నయేఫ్ ను చంపేందుకు మహ్మద్ బిన్ సల్మాన్ 2020లో కిరాయిమూకలను పంపాడు, వీడు నన్ను కూడా చంపేంతవరకు నిద్రపోడు అంటూ సాద్ అల్ జాబ్రి ఆందోళన వ్యక్తం చేశారు. 

అయితే, సాద్ అల్ జాబ్రి ఇంటర్వ్యూపై అమెరికాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది. కట్టుకథలు అల్లడంలో సాద్ అల్ జాబ్రికి సుదీర్ఘమైన చరిత్ర ఉందని పేర్కొంది. ఏమాత్రం విశ్వసనీయత లేని వ్యక్తి అని విమర్శించింది. తన ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికే అతడు ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నాడని మండిపడింది.


More Telugu News