నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. నిరూపించలేకపోతే విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలి: రఘురాజు

  • కరుణానిధి ఎన్నికల్లో గెలుస్తూనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారన్న రఘురాజు
  • విజయసాయి ఎవరెవరికి సూట్ కేసులు పంపిస్తున్నారో తనకు తెలుసని వ్యాఖ్య
  • సూట్ కేసు దందాలను ఆపేయాలని సూచన
తమ పార్టీ వైసీపీలో శాశ్వత అధ్యక్షుడి గొడవ ఎక్కువయిందని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిని కూడా తాను కలిశానని.. అయితే, వైసీపీ ప్లీనరీలో చేసిన తీర్మానానికి సంబంధించిన సమాచారం తమ వద్దకు వచ్చిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తనతో చెప్పారని అన్నారు. 

ఇదే సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రఘురాజు మండిపడ్డారు. దొంగ కంపెనీలు నడిపేవాడు, సూట్ కేసులు మోసేవాడు తమ పార్టీ జాతీయ కార్యదర్శి ఏంటని ఎద్దేవా చేశారు. ఆయన ఎవరెవరికి సూట్ కేసులు పంపిస్తున్నారో అన్ని వివరాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అందరినీ సూట్ కేసులతో మేనేజ్ చేయవచ్చని అనుకోవద్దని... ఇకనైనా సూట్ కేస్ దందాలను ఆపేయాలని సూచించారు. 

డీఎంకే శాశ్వత అధ్యక్షుడిగా కరుణానిధి ఉన్నారని విజయసాయిరెడ్డి అంటున్నారని... డీఎంకే అధ్యక్ష పదవికి ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగాయని... ఆ ఎన్నికల్లో గెలుస్తూనే కరుణానిధి చిరస్థాయిగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారని రఘురాజు తెలిపారు. ఈ విషయంపై డీఎంకే నేతలతో కూడా తాను మాట్లాడానని... అధ్యక్ష పదవికి తాము ఎన్నికలు నిర్వహిస్తామని వారు తనతో చెప్పారని అన్నారు. ఎన్నికలను నిర్వహించకుండానే కరుణానిధి శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగారనే విషయాన్ని విజయసాయి నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని.. నిరూపించలేకపోతే విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News