వర్షాల నేపథ్యంలో.. హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ హెచ్చరికలు

  • మరో 12 గంటల పాటు వర్షాలు కురుస్తాయన్న జీహెచ్ఎంసీ
  • అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక
  • ప్రజలతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్
హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కాసేపు వర్షం ఆగినట్టు ఆగినా... ఆ వెంటనే భారీ వర్షమో, ఓ మోస్తరు వర్షమో కురుస్తోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. 

రానున్న 12 గంటల పాటు బలమైన ఈదురుగాలులతో పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. రాత్రి 10 గంటల వరకు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని తెలిపారు. గాలుల తీవ్రతకు మరిన్ని చెట్లు విరిగిపడే అవకాశం ఉందని అన్నారు. ప్రజలతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 

అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. వర్షం సమయంలో ఎవరూ చెట్ల కిందకు వెళ్లొద్దని సలహా ఇచ్చారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, నగరంలో డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరోవైపు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.


More Telugu News