9 నెలల కనిష్ఠానికి బంగారం ధరలు.. ముందుముందు ఎలా ఉంటుంది?
- అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 1,735 డాలర్లు
- దేశీయంగా ఎంసీఎక్స్ లో తులం ధర రూ.50,600
- సమీప భవిష్యత్తులో అమ్మకాల ఒత్తిడి ఉంటుందన్న అంచనా
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తొమ్మిది నెలల కనిష్ఠానికి చేరాయి. యూఎస్ డాలర్ 20 ఏళ్ల గరిష్ఠాలకు పెరగడం బంగారంతోపాటు, రూపాయిపైనా ప్రభావం చూపిస్తోంది. ఔన్స్ బంగారం (28.34 గ్రాములు) స్పాట్ ధర 1,734.97 డాలర్లకు చేరింది. 2021 సెప్టెంబర్ లో 1,722.36 డాలర్ల కనిష్ఠం తర్వాత తిరిగి అదే స్థాయికి చేరుకుంది. మన దేశీ మార్కెట్లోనూ బంగారం ధర తగ్గింది. గత వారం తులం బంగారం ధర రూ.52,300 వరకు పలకగా, అది ఇప్పుడు ఎంసీఎక్స్ లో రూ.50,600 వద్ద ఉంది.
అయితే అంతర్జాతీయ మార్కెట్ల స్థాయి ధరలు మన దగ్గర లేవు. అంతర్జాతీయ మార్కెట్ లెక్క ప్రకారమే అయితే మన దగ్గర గ్రాము బంగారం రూ.4,897 ఉండాలి. కానీ, రూ.5,060 ఉంది. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాలు పెంచడం వల్ల ఈ వ్యత్యాసం నెలకొంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మరింత పెంచితే అప్పుడు బంగారంపై దిగుబడులు తగ్గుతాయి. దాంతో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులు తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతారు. దీనివల్ల బంగారం ధరలు మరి కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయన్నది నిపుణుల అంచనా.
వెండి ధర 0.3 శాతం పెరిగి ఔన్స్ కు 19.14 డాలర్లుగా ఉంది. మరోవైపు కమోడిటీ ధరల పతనం, ఈటీఎఫ్ ల నుంచి పెట్టుబడులు బయటకు పోతుండడం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.