ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. సముద్రంలోకి 12.10 లక్షల క్యూసెక్కుల నీరు

  • రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు
  • ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్ల ఎత్తివేత
  • కోనసీమలో 200 బోట్లను సిద్ధం చేసిన అధికారులు
ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల ధాటికి గోదావరి నది పోటెత్తుతోంది. రెండు రాష్ట్రాల్లో గోదావరి వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.3 అడుగులకు చేరుకుంది. కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో తొలి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 

ఈ క్రమంలో బ్యారేజీ వద్ద 175 గేట్లను అధికారులు ఎత్తేశారు. 12.10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరదనీరు భారీ మొత్తంలో సముద్రంలోకి వదులుతున్న నేపథ్యంలో కోనసీమ జిల్లాలో అధికార యత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి 200 బోట్లను సిద్ధం చేశారు. 

మరోవైపు భద్రాచలం వద్ద నీటి మట్టం 53.4 అడుగులకు పెరిగింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరదనీరు పెరగడంతో... భద్రాచలంలోని రామాలయ మాడ వీధులు, అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ ప్రాంతాల్లో ఉన్న దాదాపు 600 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు.


More Telugu News