థాకరేకు మరో తలనొప్పి.. రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకే ఓటేద్దామంటున్న శివసేన ఎంపీలు

  • 18 మంది ఎంపీల్లో 12 మంది మొగ్గు ఎన్డీఏ అభ్యర్థికే
  • పార్టీ సమావేశంలో థాకరేకు స్పష్టం చేసిన ఎంపీలు
  • విపక్షాల అభ్యర్థి సిన్హాకు మద్దతిస్తున్న అఘాడీ కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీపీ 
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన ఉద్ధవ్ థాకరేకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఆ పార్టీకి చెందిన 19 ఎంపీల్లో 12 మంది రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతు ఇవ్వాలని థాకరేకు స్పష్టం చేశారు. 

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై సోమవారం రాత్రి ముంబైలోని మాతోశ్రీ (ఉద్ధవ్‌ థాకరే వ్యక్తిగత నివాసం)లో శివసేన ఎంపీలు సమావేశమై చర్చించారు. ఈ భేటీకి 15 మంది ఎంపీలు హాజరయ్యారు. సీఎం ఏక్ నాథ్ షిండే కుమారుడైన ఎంపీ శ్రీకాంత్ షిండేతోపాటు షిండేకు మద్దతిస్తున్నట్లుగా భావిస్తున్న మరో ఐదుగురు ఎంపీలు సమావేశానికి దూరంగా ఉన్నారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమిగా శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో పలువురు శివసేన ఎమ్మెల్యేలు అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నూతన సీఎంగా ఏక్ నాథ్ షిండే బాధ్యతలు తీసుకోగా.. ఉద్ధవ్ పదవి కోల్పోయారు. అయితే, ప్రభుత్వం పడిపోయినప్పటికీ అఘాడీ కూటమిలోనే శివసేన కొనసాగుతోంది.
 
మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు ఇస్తున్నాయి. అయితే, అఘాడీ కూటమిలో ఉన్నా, బీజేపీతో కలిసి ఏక్ నాథ్ షిండే తమ ప్రభుత్వాన్ని పడగొట్టినా కూడా ఎంపీలు గిరిజనురాలైన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని ఉద్ధవ్‌ను కోరారు. మహారాష్ట్రలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నందున ఆమెకు ఓటు వేద్దామని సూచించారు.

అయితే, దీనిపై తన నిర్ణయాన్ని రెండు రోజుల్లో చెబుతానని ఉద్ధవ్‌ వారికి చెప్పినట్టు సమాచారం. ఎంపీల కోరిక మేరకు శివసేన ముర్ముకు ఓటు వేస్తే అఘాడీ కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీపీ ఎలా స్పందిస్తాయన్నది చర్చనీయాంశమైంది. దాంతో, ఉద్ధవ్ ఇరకాటంలో పడ్డారు. ఈ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.


More Telugu News