అమర్ నాథ్ వరదల్లో గల్లంతైన ఏపీ యాత్రికుల్లో 35 మంది సురక్షితం

  • ఒకరి మృతి, ఇంకా లభ్యం కాని మరో మహిళ ఆచూకీ
  • నెల్లూరు జిల్లా నుంచి యాత్రకు వెళ్లిన 82 మంది 
  • మూడు రోజుల తర్వాత అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం
అమర్‌నాథ్‌ యాత్రలో వరద బీభత్సం కారణంగా గల్లంతైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 35 మందిని సహాయక బృందాలు కాపాడాయి. వీరందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఏపీ నుంచి యాత్రకు వెళ్లి గల్లంతైన 37 మందిలో ఒకరు చనిపోగా.. మరొకరి జాడ ఇంకా తెలియలేదు. చనిపోయిన మహిళను రాజమహేంద్రవరంకు చెందిన గుణిశెట్టి సుధ (48)గా గుర్తించారు. గల్లంతైన పార్వతి (57) అనే మరో మహిళ కోసం గాలిస్తున్నారు.  

నెల్లూరు జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారని ఆ జిల్లా కలెక్టర్‌ చక్రధర్ బాబు తెలిపారు. వీరిలో ఇప్పటి వరకు 57 మంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. నెల్లూరు జిల్లా యాత్రికుల కోసం 1902 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా తాత్కాలికంగా రద్దయిన అమర్‌నాథ్‌ యాత్ర మూడు రోజుల తర్వాత తిరిగి ప్రారంభమయింది. జమ్మూ బేస్‌ క్యాంప్‌ నుంచి 4,026 మంది భక్తులతో కూడిన బ్యాచ్‌ సోమవారం తెల్లవారుజామున బయలుదేరింది. వాళ్లు సీఆర్‌పీఎఫ్‌ భద్రతతో కూడిన 110 వాహనాల్లో వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.


More Telugu News