డీఎంకే శాశ్వత అధ్యక్షునిగా కరుణానిధి ఎన్నికైనప్పుడు ఇదే మీడియా ఆయనను ఆకాశానికెత్తింది: విజయసాయిరెడ్డి

  • ఇటీవల వైసీపీ ప్లీనరీ నిర్వహణ
  • పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నిక
  • విపక్షాల నుంచి విమర్శలు
  • ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని విషపు రాతలు అంటూ విజయసాయి విమర్శలు 
ఇటీవల జరిగిన వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ ను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం తెలిసిందే. అయితే దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా చేశారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఓ పత్రికలో 'కిమ్... పింగ్... జగన్' అంటూ కథనం కూడా వెలువరించారు. ఉత్తర కొరియా, చైనా... దేశాలు అని, అక్కడ శాశ్వత అధ్యక్షులు ఉండడం వేరని, కానీ ఏపీ భారతదేశంలో ఓ రాష్ట్రం అని, ఇక్కడ ప్రజాస్వామ్య రక్షణకు ఓ చట్టం కూడా ఉందని, నిర్దిష్ట ఎన్నికల నియమావళి ఉందని ఆ కథనంలో పేర్కొన్నారు. ప్రతి పార్టీ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. 

దీనిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. గతంలో డీఎంకే శాశ్వత అధ్యక్షుడిగా కరుణానిధి ఎన్నికైనప్పుడు ఇదే పచ్చ మీడియా ఉదయించే సూర్యుడంటూ ఆయనను ఆకాశానికెత్తిందని ఆరోపించారు. విలువలు పాతాళానికి పడిపోయినప్పుడు పచ్చ కులమీడియాకు ఇప్పుడు ఇది తప్పుగా కనిపిస్తోందని విజయసాయి విమర్శించారు. ఆ మీడియా విషపు రాతలు కూడా అంతే దిగజారాయని పేర్కొన్నారు. తన ట్వీట్ కు సదరు పత్రికా కథనాన్ని కూడా ఆయన జోడించారు.


More Telugu News