సల్మాన్ ఖాన్ ను మా కమ్యూనిటీ క్షమించదు: గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్

  • కృష్ణ జింకను తమ మత గురువు పునర్జన్మగా అభివర్ణన
  • కోర్టులు విధించిన శిక్ష అంతిమం కాదని కామెంట్
  • బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • లేదంటే అతడ్ని తమ సమాజం క్షమించదన్న బిష్ణోయ్
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను కాల్పులతో పొట్టన పెట్టుకున్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ గ్రూపు.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ పంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటొంది. రెండు వారాల క్రితం అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయగా విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు.  

సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసులో వాదనలు వినిపించిన లాయర్ హస్తిమల్ సారస్వత్ కు సైతం లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు ఆదేశాల మేరకు బెదిరింపు లేఖ వచ్చినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. లాయర్ కు అందిన లేఖలో సిద్ధూ మూసేవాలకు పట్టిన గతే పడుతుందని రాసి ఉంది. తమ  కమ్యూనిటీ సల్మాన్ ఖాన్ ను క్షమించబోదని లారెన్స్ బిష్ణోయ్ చెప్పారు. 

‘‘కృష్ణ జింకను, మా మత గురువు భగవాన్ జంబేశ్వర్ పునర్జన్మగా బిష్ణోయ్ లు భావిస్తారు. కృష్ణ జింకల వేట కేసులో కోర్టు విముక్తి కల్పించడం లేదా శిక్షించడం అతడికి చివరి శిక్ష కాబోదు. సల్మాన్, ఆయన తండ్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే బిష్ణోయ్ లు వారిని అంతమొందిస్తారు’’ అని లారెన్స్ బిష్ణోయ్ చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు


More Telugu News