కేసీఆర్ కు మూడింది.. వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే: బండి సంజయ్

  • జోగులాంబ అమ్మవారిని వ్యంగ్యంగా మాట్లాడుతారా? అంటూ నిలదీత 
  • దేవుళ్లను, ధర్మాన్ని తిట్టేందుకు కేసీఆర్ కు సిగ్గుండాలన్న సంజయ్ 
  • ఇదే సీఎం కేసీఆర్ కు రాజకీయ సమాధి కాబోతోందని వ్యాఖ్య 
  • ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి ఎందుకని ప్రశ్న 
కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, అందుకే బీజేపీని, ప్రధాని మోదీని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కు సంస్కారం లేదని, దేశ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడే మాటలేనా అవి అని నిలదీశారు. ఆదివారం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో బీజేపీ, మోదీలపై విమర్శలు గుప్పించడంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.

‘‘కేసీఆర్ కు మూడింది.. దగ్గరపడినప్పుడు భాష అలాగే వస్తుంది. జోగులాంబ అమ్మవారిని కూడా తిట్టేలా, వ్యంగ్యంగా మాట్లాడటం దారుణం. ఇలా మాట్లాడే బదులు రాజకీయాలు వదిలేసి ఇంట్లో ఉండిపోవాలి. కేసీఆర్ దేవుళ్లను తిడతారు, ధర్మాన్ని తిడతారు. సిగ్గుండాలి. కేసీఆర్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేకుంటే ప్రజలు టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం, డ్రైనేజీలో కలపడం ఖాయం. హిందువుల మనోభావాలను కించపర్చేలా కేసీఆర్ మాట్లాడారు. ఇదే సీఎం కేసీఆర్ కు రాజకీయ సమాధి కాబోతోంది.” అని బండి సంజయ్ పేర్కొన్నారు.

ప్రజల దృష్టిని మళ్లించే యత్నం
‘‘రాష్ట్రం వరదలో మునిగిపోతుంటే.. ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ ను ఇస్తాంబుల్, లండన్, సింగపూర్ చేస్తామన్న మాటలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యలపై ఎప్పుడైనా కేసీఆర్ బయటికి వచ్చారా? ఫామ్ హౌస్  దాటి బయటికి రాని ముఖ్యమంత్రి ఉండి ఎందుకు? లేక ఎందుకు?” అని సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండే వంటి గట్టి నేతలు ఉన్నారని.. అది తెలిసే కేసీఆర్ భయపడుతున్నారని, ఆ పేరును పదే పదే ఎత్తుతున్నారని వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో నేరాల నియంత్రణ ఏది?
‘‘కేసీఆర్ కు, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మోదీ రోజుకు 18 గంటలు పని చేస్తారు. కేసీఆర్.. ఫామ్ హౌస్ కు వెళితే రోజులకు రోజులు బయటికే రారు. రాష్ట్రంలో రోజుకో హత్య, అత్యాచారం ఘటనలు జరుగుతున్నాయి. మైనర్ బాలికలపై అత్యాచారం జరిగితే.. ఒక్కరిని కూడా పట్టుకుని శిక్షించలేకపోతున్నారు. అదే బీజేపీ ప్రభుత్వం ఉన్న యూపీలో క్రిమినల్స్ జైలు లోంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. శిక్షా కాలం ముగిసినా బయటికి రావడానికి జంకుతున్నారు.” అని సంజయ్ వెల్లడించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు. 

కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలమైందని, అయినా మోదీ ఆధ్వర్యంలో భారత ఆర్థిక వ్యవస్థ గట్టిగా నిలబడిందని సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సరిగా జీతాలివ్వలేని కేసీఆర్.. దేశం మొత్తాన్ని చూసుకునే మోదీని విమర్శించడమేమిటని ప్రశ్నించారు.



More Telugu News