మూడు రోజులు జాగ్రత్త.. మూడు, నాలుగు హెలికాప్టర్లు సిద్ధం చేశాం.. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్

  • ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ప్రెస్ మీట్
  • వీలైనంత వరకు ఇళ్లలోంచి బయటికి రావొద్దని సూచన
  • కల్వర్టులు, కాజ్ వేలపై ప్రవాహాల వద్ద ఎవరూ సాహసాలు చేయవద్దని విజ్ఞప్తి
  • ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశం
బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా నాలుగైదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని.. అందువల్ల అధికార యంత్రాంగం, ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం ఉన్నతాధికారులు, వాతావరణశాఖ నిపుణులతో సమీక్షించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు పలు సూచనలు చేశారు. 

వరదలు పెరిగే అవకాశముంది..
‘‘ఇంతకుముందే ఉన్నతాధికారులు, వాతావరణ శాఖ అధికారులతో సమీక్షించాం. ఇప్పటికే గోదావరిలో సమ్మక్క బ్యారేజీ దగ్గర 9 లక్షలకుపైగా క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేశాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నాలుగు లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తోంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను సిద్ధం చేశాం. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని కేసీఆర్‌ ప్రకటించారు.

హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచాం..
‘‘భారీ వర్షాలతో అకస్మాత్తు వరదలు వస్తే సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు వైమానిక దళాన్ని సంప్రదించాం. రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ తోపాటు వైమానిక దళ హెలికాప్టర్లు కలిపి నాలుగైదింటిని సిద్ధంగా ఉంచుతున్నాం. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంటుంది. ప్రజలకు మేం చేసుకునే విజ్ఞప్తి ఏమిటంటే.. రాబోయే మూడు రోజులు అంటే సోమ, మంగళ, బుధవారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. స్కూళ్ల నుంచి యూనివర్సిటీల దాకా ఈ మూడు రోజులు అన్ని రకాల విద్యా సంస్థలను మూసివేస్తున్నాం..” అని కేసీఆర్ తెలిపారు.

బయటికి వెళ్లొద్దు.. దుస్సాహసాలు వద్దు.. 
‘‘రోడ్లు, కల్వర్టులపై నీరు ప్రవహిస్తుంటే కొంత మంది దుస్సాహసం చేస్తుంటారు. అలాంటివి చేయెద్దు.  కల్వర్టులపై వరద ఉంటే బస్సులు నడపవద్దని ఆర్టీసీ ఆధికారులకు చెప్పాం. వానలకు నాని ఇళ్లు కూలిపోతున్నాయి. అందువల్ల రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని వేల పాత ఇళ్లను కూలగొట్టించాం. మరికొన్ని చోట్ల కోర్టు స్టేలతో కూల్చివేతలు ఆగిపోయాయి. అలాంటి చోట ఇళ్లలో జనం ఉండకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించాం.

పిల్లలు, యువకులను బయటికి వెళ్లనివ్వొద్దు
‘‘అతి భారీ వర్షాలు కురిసిన ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చెరువులు తెగిపోయినట్టు సమాచారం వచ్చింది. ఇంకో నాలుగు రోజులు ఉధృతమైన వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత మరో నాలుగైదు రోజుల పాటు వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలు, యువకులను బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. ఈ ఉద్దేశంతోనే విద్యా సంస్థలన్నింటినీ మూసివేశాం..” అని కేసీఆర్ తెలిపారు.

అందరూ జాగ్రత్తలు పాటించాలి
‘‘గ్రామ పెద్దలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా చురుకుగా ఉండాలి. ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గాల్లో ఉండాలని సూచించాం. ఎప్పటికప్పుడు అంతా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలి. గోదావరి ఉప్పొంగడం వల్ల తీరాన ఉన్న మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో ముంపు నెలకొనే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్త ఏర్పాట్లు చేశాం. సచివాలయం, పంచాయతీరాజ్‌, మున్సిపల్ శాఖలు, జీహెచ్‌ఎంసీలో కంట్రోల్‌ రూమ్‌ లు ఏర్పాటు చేశాం. అత్యవసరమైతే కాల్‌ సెంటర్లకు ఫోన్‌ చేస్తే వెంటనే అధికారులు స్పందిస్తారు..” అని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి నల్లగొండకు వచ్చిన ఇద్దరు దురదృష్టవశాత్తు వానకు గోడ కూలి మరణించారని.. వారికి సానుభూతి ప్రకటిస్తున్నామని.. చెరో రూ3 లక్షల చొప్పున పరిహారాన్ని ఇస్తామని ప్రకటించారు.


More Telugu News