అలాంటి ఇలాంటిది కాదు.. ఇది ఆకుల్లో మహారాజా!

  • ప్రపంచంలోనే అతిపెద్ద ఆకు ఉన్న వాటర్ లిల్లీ జాతి మొక్కను గుర్తించిన శాస్త్రవేత్తలు
  • బొలివియాలోని రిన్ కోనాడా గార్డెన్స్ లో గుర్తింపు
  • ఏకంగా మూడున్నర మీటర్ల వ్యాసంతో భారీ ఆకులు
  • చిన్న పిల్లలు దానిపై కూర్చున్నా ఆపగలిగే శక్తి వాటి సొంతం
నేలపై పెరిగే మొక్కల నుంచి పెద్ద చెట్ల దాకా.. ఎన్ని రకాలైనా, ఎన్ని రంగుల్లో ఉన్నా ఆకులు మాత్రం తప్పనిసరి. కొన్నిసార్లు చిన్న చిన్న మొక్కలకు పెద్ద పెద్ద ఆకులు ఉంటే.. చింత చెట్టు లాంటి భారీ వృక్షాలకు కేవలం ఒక సెంటీమీటర్ వెడల్పు ఉండే అతి చిన్న ఆకులు ఉంటుంటాయి. మరి అన్నింటికంటే పెద్ద ఆకులు ఏ చెట్టుకు/మొక్కకు ఉంటాయో తెలుసా? టేకు చెట్లకు కాస్త పెద్ద ఆకులు ఉంటాయి. అరటి ఆకులు చాలా పెద్దగా ఉంటాయిగానీ సన్నగా, పొడవుగా ఉంటాయి. ఇవేవైనా సరే వాటర్ లిల్లీ ఆకులతో సరిరావు. తామర మొక్కల తరహాలో నీటిలో పెరిగే వాటర్ లిల్లీ ఆకులు గుండ్రంగా చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి. అలాంటిది వాటర్ లిల్లీలో కూడా చాలా పెద్ద రకాన్ని బ్రిటిష్‌ రాయల్ బొటానికల్ గార్డెన్స్ శాస్త్రవేత్తలు తాజాగా దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో గుర్తించారు. 

ఎన్నో ఏళ్ల తర్వాత..
  • నిజానికి 19వ శతాబ్దంలో యూరోపియన్‌ వృక్ష శాస్త్రవేత్తలు అతిపెద్ద ఆకులతో కూడిన వాటర్‌ లిల్లీ మొక్కలను గుర్తించారు. వాటికి అప్పటి బ్రిటిష్‌ రాణి పేరిట విక్టోరియా జాతికి చెందిన మొక్కలుగా పేరుపెట్టారు. వాటి ఒక్కో ఆకు పెద్ద సైజు టేబుల్ అంత ఉంటుంది.
  • ప్రపంచంలో అలాంటివి కేవలం అమెజాన్ ప్రాంతంలో ఒకచోట, బ్రిటన్ లో మరోచోట మాత్రమే ఉన్నాయి. చిన్న పిల్లలు వాటిపై కూర్చున్నా కూడా అలాగే నీటిపై తేలుతూ ఉండగలిగేంత బలంగా వీటి ఆకులు ఉంటాయి.
  • కానీ ఇన్నేళ్ల తర్వాత బొలీవియాలోని రిన్‌కొనాడా గార్డెన్స్‌లో పెరుగుతున్న భారీ వాటర్ లిల్లీని గుర్తించారు. దాని ఆకులు ఏకంగా మూడున్నర మీటర్లకుపైగా వ్యాసంతో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అంటే ఒక చిన్న సైజు గది అంత పెద్దగా ఈ ఆకులు ఉన్నాయి.
  • ప్రపంచంలో ఉన్న మిగతా రెండు వాటర్ లిల్లీ జాతులకు, దీనికి సంబంధం లేదని.. ఇది మొదటి నుంచీ వేరుగా పెరుగుతున్న మరో జాతి వాటర్ లిల్లీ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
  • ఇటీవలే ఫ్రాంటియర్స్‌ ఇన్‌ ప్లాంట్‌ సైన్సెస్‌ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.


More Telugu News