మిషన్ తెలంగాణ మొదలైంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుస్తాం: మాణిక్యం ఠాగూర్

  • తెలంగాణలో 80 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యం
  • సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ
  • సిరిసిల్లలో రాహుల్ గాంధీతో ఏర్పాటు చేయనున్న సభపై చర్చించామని వెల్లడి
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ అన్నారు. కనీసం 70 నుంచి 80 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజుతో కలిసి భేటీ అయి.. రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం మాణిక్యం ఠాగూర్ మీడియాతో మాట్లాడారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసే రాహుల్ గాంధీ సభకు సంబంధించిన అంశాలపై చర్చించామని తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చన్నారు.

ఏకాభిప్రాయంతోనే టికెట్లు..
కాంగ్రెస్ పార్టీ మిషన్ తెలంగాణను మొదలు పెట్టిందని.. పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మాణిక్యం ఠాగూర్ తెలిపారు. పార్టీలో చేరినవారందరికీ టికెట్లు ఇస్తామన్న హామీ ఏమీ లేదని.. ఏకాభిప్రాయంతోనే టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. అందరితో కలిసి పని చేస్తామని చెప్పారు. ఏ ఒక్కరితోనో పార్టీ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. కాగా.. తాను పార్టీలో చురుగ్గానే ఉన్నానని.. మొదటి నుంచి పార్టీలో ఉండి కష్టపడ్డ వారికే టికెట్లు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.


More Telugu News