శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా పార్లమెంటు స్పీకర్ మహీంద అభేవర్ధనే!

  • శ్రీలంకలో తారాస్థాయికి సంక్షోభం
  • వెల్లువెత్తిన ప్రజాగ్రహం
  • పదవులకు రాజీనామా చేసిన గొటబాయ, విక్రమసింఘే
  • అత్యవసరంగా సమావేశమైన అఖిలపక్ష నేతలు
తీవ్ర సంక్షోభం నడుమ కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో కొలిక్కి వచ్చేట్టు కనిపించడంలేదు. తన నివాసం నుంచి పారిపోయిన గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, ఆపై ప్రధాని పదవి నుంచి రణిల్ విక్రమసింఘే తప్పుకోవడం తెలిసిందే. గొటబాయ ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ప్రజాపోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజధాని కొలంబోలో నిన్న ఆక్రమించుకున్న అధ్యక్షుడు, ప్రధాని నివాసాల్లోనే ఆందోళనకారులు ఇప్పటికీ ఉన్నారు.

కాగా, శ్రీలంక పార్లమెంటు స్పీకర్ మహీంద యాపా అభేవర్ధనే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే శ్రీలంకలో ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ (డబ్ల్యూఎఫ్ పీ), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రతినిధులు పర్యటించాల్సి ఉంది. ఈ రెండు సంస్థలు చేసే సాయంపైనే శ్రీలంక ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఈ రెండు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపడం అత్యంత ఆవశ్యకం.

ఈ నేపథ్యంలో, అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలంటూ నిన్న పార్లమెంటు స్పీకర్ అభేవర్ధనే... గొటబాయకు సూచించారు. దాంతో అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్టు గొటబాయ ప్రకటించారు. కాగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై స్పీకర్ అభేవర్ధనే నివాసంలో పలు రాజకీయ పక్షాల నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. రాజ్యాంగం ప్రకారం ఆపద్ధర్మ దేశాధినేతగా స్పీకరే బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందని వివిధ పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.


More Telugu News