హైదరాబాద్, ఢిల్లీలో సాంకేతిక నిపుణులు అందుబాటులో లేక ఇండిగో తిప్పలు!

  • కరోనా సమయంలో వేతనాలు తగ్గించిన ఇండిగో
  • వేతనాలపై ఇండిగో ఉద్యోగుల అసంతృప్తి!
  • ఉద్యోగుల సామూహిక సెలవులు
  • పలుచోట్ల విధులకు గైర్హాజరు
నిన్న మొన్నటి దాకా పైలెట్లు, క్యాబిన్ సిబ్బంది అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడిన ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థకు తాజాగా సాంకేతిక నిపుణుల సెగ తగిలింది. హైదరాబాద్, ఢిల్లీలో విమానాల నిర్వహణ, మరమ్మతుల సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇండిగోకు కష్టాలు తప్పలేదు. చాలామంది టెక్నీషియన్లు సామూహికంగా సెలవు పెట్టారు. వేతనాలు, ఇతర భత్యాల అంశంలో వారు ఇండిగో యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మేనేజ్ మెంట్ తీరు పట్ల నిరసనగానే వారు విధులకు డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది. 

హైదరాబాదులో జులై 8న రాత్రిపూట విధులకు సాంకేతిక నిపుణులు గైర్హాజరయ్యారని, ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని ఎయిర్ లైన్స్ వర్గాలు తెలిపాయి. పరిస్థితిని ఇండిగో నిశితంగా సమీక్షిస్తోందని, నిపుణుల గైర్హాజరీ నేపథ్యంలో నష్టనివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించాయి. ఎక్కడా విమాన సర్వీసులు ఆలస్యం కావడం గానీ, ఆటంకాలు ఏర్పడడం గానీ లేదని వివరించాయి. 

కాగా, కొన్నిరోజుల కిందట ఇండిగో విమాన సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలామంది సిబ్బంది ఒక్కసారిగా సిక్ లీవ్ పెట్టారు. పెద్ద సంఖ్యలో సిబ్బంది ఏకకాలంలో అనారోగ్యం పాలవడం ఏంటని ఆరాతీస్తే దిగ్భ్రాంతికర వాస్తవం వెల్లడైంది. వారంతా ఆ రోజు ఎయిరిండియా సంస్థలో ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్లారని తేలింది. 

గత కొంతకాలంగా ఇండిగో ఉద్యోగులు మెరుగైన జీతాల కోసం డిమాండ్ చేస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఇండిగో సంస్థ తన ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం కోత విధించింది. ఇటీవల ఏప్రిల్ లో 8 శాతం వేతనాలు పెంచింది. నవంబరులో మరో ఆరున్నర శాతం పెంచుతామని ఉద్యోగులకు హామీ ఇచ్చింది. అయితే, ఇండిగో హామీ ఉద్యోగుల్లో అసంతృప్తిని తొలగించలేకపోయింది. అందుకే ఇటీవల తరచుగా సామూహిక సెలవుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.


More Telugu News