భారత్ నుంచి ఉక్రెయిన్ రాయబారిని వెనక్కి పిలిపించిన జెలెన్ స్కీ

  • ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
  • తటస్థ వైఖరి అవలంబిస్తున్న భారత్
  • ఐరాసలోనూ ఓటింగ్ కు దూరం
  • అదే బాటలో కొన్ని దేశాలు 
  • అనూహ్య నిర్ణయం తీసుకున్న జెలెన్ స్కీ
  • పలు దేశాల నుంచి తమ రాయబారుల రీకాల్
ఉక్రెయిన్-రష్యా సంక్షోభంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా తీరును ఖండించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ భారత్ సహా ఇతర ప్రపంచదేశాలను అప్పట్లోనే కోరారు. కానీ, భారత్ ఎటు వైపు మొగ్గలేదు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు సూచించింది. అంతేకాదు, ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన పలు తీర్మానాలపై ఓటింగ్ కు కూడా భారత్ దూరంగా ఉండిపోయింది. 

మరి ఈ కారణమో, ఇంకే కారణమో తెలియదు కానీ.... జెలెన్ స్కీ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. భారత్ లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించారు. భారత్ నుంచే కాదు, నార్వే, చెక్ రిపబ్లిక్, జర్మనీ, హంగేరీ దేశాల నుంచి కూడా తమ రాయబారులను వెనక్కి పిలిపించారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడి అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్నారు. అయితే, ఆయా దేశాల్లో రాయబారులను ఎందుకు తొలగించారన్నది మాత్రం వెల్లడించలేదు. 

భారత్ మాత్రమే కాకుండా, అనేక దేశాలు రష్యా విషయంలో ఆచితూచి స్పందిస్తున్నాయి. పలు ప్రయోజనాలకు సంబంధించి రష్యాతో ఒప్పందాలు, ఇతర అంశాలు ముడిపడి ఉన్న దేశాలు ఉక్రెయిన్ కు మద్దతు ప్రకటించడంలో తటస్థ వైఖరికే ప్రాధాన్యత ఇస్తున్నాయి.


More Telugu News