మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు టోకనైజేషన్ చేయించుకున్నారా..?

  • సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగింపు
  • ఈ లోపు టోకనైజేషన్ చేసుకోవాలి
  • దీనివల్ల కార్డు సున్నిత డేటా లీకేజీకి చెక్
  • టోకనేజ్ చేసుకోక పోయినా కార్డు వాడుకోవచ్చు
డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్న వారు వాటిని మర్చంట్ ప్లాట్ ఫామ్ లపై టోకనైజేషన్ చేసుకునే గడువును ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. కనుక టోకనైజేషన్ చేసుకోని వారు ఈ లోపు ఆ పనిచేసుకోవాలి. అయితే టోకనైజేషన్ అంటే ఏంటి? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. 

టోకనైజేషన్ అంటే..?
ప్రస్తుతం ఆన్ లైన్ వేదికలపై కొనుగోళ్లకు చెల్లింపులు చేసే సమయంలో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలు ఇస్తామని తెలిసిందే. వాటిని ఆయా వేదికలు స్టోర్ చేసి పెడతాయి. దీంతో చెల్లింపులు చేసే ప్రతిసారి ఆయా వివరాలు నమోదు చేయాల్సిన ఇబ్బంది ఉండదు. కార్డు వెనుక ఉండే మూడు అక్షరాల సీవీవీని ప్రతి విడత ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని నమోదు చేయడం ద్వారా లావాదేవీ పూర్తవుతుంది. 

ఇలా నమోదు చేసిన కార్డు వివరాలు లీకయ్యే ప్రమాదం ఉంటుంది. సైబర్ నేరస్థుల పాలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే కార్డుల సున్నిత డేటా లీకయ్యే ప్రమాదం లేకుండా ఆర్బీఐ తీసుకొచ్చిందే కార్డు టోకనేజేషన్ విధానం. ఈ విధానంలో కార్డుపై ఉండే 16 అంకెలు మర్చంట్ ప్లాట్ ఫామ్ పై సేవ్ కావు. దీనికి బదులు ఆయా కార్డు దారుడు, టోకెన్ రిక్వెస్టర్, డివైజ్ నంబర్ల కలయికతో ఓ టోకెన్ జారీ అవుతుంది. పైగా ఇది మారుతూ ఉంటుంది. ఇలా ఒక మర్చంట్ ప్లాట్ ఫామ్ పై కార్డు దారుడు ఒక్కసారి టోకనైజేషన్ చేసుకుంటే చాలు. వాస్తవ కార్డు డేటా స్థానంలో టోకెన్ నమోదై ఉంటుంది.

కస్టమర్ల కార్డులకు సంబంధించి సున్నితమైన డేటాను స్టోర్ చేసుకోవద్దని వాలెట్లు, చెల్లింపుల అగ్రిగేటర్లు, వర్తకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనికి బదులు టోకెన్ మాత్రమే వారు స్టోర్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని కార్డులను అయినా టోకనైజేషన్ చేసుకోవచ్చు. పరిమితి లేదు.  

టోకనైజేషన్ చేసుకోకపోతే..?
సెప్టెంబర్ 30 నాటికి టోకనైజేషన్ చేసుకోకపోతే.. అక్టోబర్ 1 నుంచి ఆన్ లైన్ చెల్లింపులు చేసే ప్రతి సందర్భంలోనూ కార్డు దారుడు తన కార్డుపై 16 అంకెలను, సీవీవీని నమోదు చేసి, చెల్లింపులు చేయాల్సి వస్తుంది. అంతేకానీ, పనిచేయకుండా పోదు.


More Telugu News