భారత్​ లో ఇకపై ప్రైవేటు ఉపగ్రహాలు

  • ఇమేజింగ్ శాటిలైట్స్ కు అనుమతి ఇస్తున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి
  • ఉపగ్రహ పాలసీ 2022లో భాగంగా  ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటన
  • ఇప్పటిదాకా దేశంలో ఇస్రో, రక్షణ శాఖ ఆధ్వర్యంలోనే ఉపగ్రహాలు
మన దేశంలో ఇప్పటిదాకా ప్రయోగించిన ఉపగ్రహాలన్నీ భారత ఉపగ్రహ పరిశోధన సంస్థ (ఇస్రో) నుంచి ప్రయోగించినవే. అంటే అన్నీ ప్రభుత్వ ఉపగ్రహాలే. అయితే, ఇకపై ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కూడా ఉపగ్రహాలను సొంతం చేసుకోవచ్చు. ఈ మేరకు నూతన ఉపగ్రహ పాలసీ 2022 ఇందుకు అవకాశం కల్పిస్తుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఇమేజింగ్ శాటిలైట్స్ ఇకపై  ప్రైవేటు సంస్థల యాజమాన్యంలో కూడా ఉంటాయన్నారు.

‘అంతరిక్ష రంగంలో సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపగ్రహ పాలసీ 2022ని రూపొందించింది. ఇందులో ప్రైవేటు యాజమాన్యాలు కూడా ఉపగ్రహాలను సొంతం చేసుకొని, వాటిని నిర్వహించే అవకాశం కల్పించింది. మనదేశంలో ఇప్పటిదాకా ఉపగ్రహాలు ఇస్రో, రక్షణ శాఖ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఇకపై ప్రైవేటు వాళ్లు కూడా ఉపగ్రహాలను సొంతం చేసుకోవచ్చు’ అని సోమనాథ్ తెలిపారు.
 
ఇందులో భారతీయ కంపెనీలు వంద శాతం పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉంటుందన్నారు. ప్రభుత్వ అనుమతితో  విదేశీ సంస్థలు నేరుగా 70 శాతం వరకు పెట్టుబడి పెట్టొచ్చన్నారు.  ప్రైవేటు కంపెనీలు రాకెట్లను కొనుగోలు చేయడంతో పాటు వాటిని అభివృద్ధి చేసి, ప్రయోగించవచ్చని అన్నారు. ఇక, ఈ ఏడాది చాలా ప్రయోగాల కోసం ప్రణాళిక చేస్తున్నట్లు సోమనాథ్ చెప్పారు. గగన్ యాన్ పథకంలో భాగంగా చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహకాలను (ఎస్ఎస్ఎల్వీ) ఈ నెల చివర్లో లేదా ఆగస్టు తొలి వారంలో ప్రయోగిస్తామని చెప్పారు.


More Telugu News