భూమి హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలపై ఇంత అమానుషమా?: సీఎం కేసీఆర్ పై రాహుల్ గాంధీ విమర్శలు

  • పోడు భూమిపై హక్కు కోసం ఆదివాసీల పోరాటం
  • ఆక్రమణలంటూ కేసులు పెట్టిన అటవీశాఖ
  • ఆదివాసీలకు మద్దతు పలికిన రాహుల్ గాంధీ
  • కృతజ్ఞతలు తెలిపిన రేవంత్ రెడ్డి
మంచిర్యాల జిల్లాలో పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీలు పోరాడుతుండగా, అటవీ భూముల్లో ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ అధికారులు ఆదివాసీలపై కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను పోలీసులు, అటవీశాఖ సిబ్బంది తొలగించే క్రమంలో ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. ఆరుగురు ఆదివాసీ మహిళలను ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. మహిళలని కూడా చూడకుండా వారిని లాగిపారేశారని ఆరోపణలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. 'జల్ జంగల్ జమీన్' పోరాటంలో ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణలో భూమి హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలపై ప్రభుత్వ వైఖరి దారుణం అని పేర్కొన్నారు. అర్హులైన ఆదివాసీలకు పోడు భూమి సాగు పట్టాలు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ సర్కారు ఆ తర్వాత వెనక్కి తగ్గిందని, ఇది ప్రజలకు ద్రోహం చేయడమేనని మండిపడ్డారు.

ఆదివాసీ గళాన్ని అణచివేసేందుకు పోలీసు బలగాలను వినియోగించడం అమానుషమని, ఇది తెలంగాణ ఆకాంక్షలకు అవమానం అని వివరించారు. కోట్లాది ప్రజల మనోభావాలను సాకారం చేయడానికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆదివాసీల హక్కుల పరిరక్షణ కూడా అందులో ప్రముఖ భాగం అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.


More Telugu News