గజదొంగల ముఠాకు, మంచి పాలనకు తేడా గమనించాలి: సీఎం జగన్

  • వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్
  • ప్లీనరీలో కీలక తీర్మానం
  • కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్
  • పథకాలు అందితేనే ఓటేయాలని వెల్లడి
ఏపీ సీఎం జగన్ వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన కృతజ్ఞతా ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటివరకు సాగించిన పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నామని తెలిపారు. మేనిఫెస్టో చూపిస్తూ వైసీపీ నేతలు గడపగడపకు వెళుతున్నారని, తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు సగర్వంగా వివరిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో అప్పులు తక్కువగానే ఉన్నాయని అన్నారు. 

లంచాలు, వివక్షకు తావులేని రీతిలో పార్టీలకు అతీతంగా ప్రజలకు లబ్ది చేకూర్చుతున్నామని, లబ్దిదారులకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తున్నామని చెప్పారు. 

గజదొంగల ముఠాకు, మంచి పాలనకు తేడా గమనించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. అమరావతిలో 54 వేల ఇళ్లు పేదలకు ఇస్తే అడ్డుకుంటున్నారని విపక్ష నేతలపై మండిపడ్డారు. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కేసులు వేస్తున్నారని ఆరోపించారు. బినామీ భూముల ధరల కోసం దుష్టచతుష్టయం అడ్డుపడుతోందని మండిపడ్డారు. ఒక జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరుపెడితే ఇళ్లు తగలబెట్టించారని విమర్శించారు.

కాగా, ఎన్నికల్లో ఫ్యాను గిర్రున తిరిగితే, సైకిల్ చక్రాలు ఊడిపోయాయని సీఎం జగన్ వ్యంగ్యం ప్రదర్శించారు. చక్రాలు లేని సైకిల్ ను బాబు తొక్కలేకపోయారని ఎద్దేవా చేశారు. తన కుమారుడితోనూ సైకిల్ తొక్కించలేకపోయారని వ్యాఖ్యానించారు. చివరికి దత్తపుత్రుడిని అరువు తెచ్చుకున్నారని ఎత్తిపొడిచారు. 

ఎన్ని కుయుక్తులు పన్నినా దేవుడి దయతో మంచే గెలుస్తుందని సీఎం జగన్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ... మేనిఫెస్టో అమలు చేశారని నమ్మితేనే జగనన్నకు తోడుగా ఉండండి అని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు అందితేనే వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించండి అని ఉద్ఘాటించారు.


More Telugu News