'మీ పాలన, మీ పతనానికి ఇదే సంకేతం' అంటూ సీఎం కేసీఆర్ పై షర్మిల ఆగ్రహం

  • ప్రత్యేక బలగాలను పెట్టి మరీ ఆదివాసీల గుడిసెలు తీసేస్తున్నారని విమర్శ
  • ఆడవాళ్లు అని  చూడకుండా ఈడ్చి పడేపిస్తున్నారని ఆవేదన
  • మొన్న చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టారంటూ షర్మిల ట్వీట్  
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై  వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు చేశారు. పోడు భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్ ప్రత్యేక బలగాలను పెట్టి మరీ ఆదివాసీల గుడిసెలు తొలగిస్తున్నారని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ఈ విషయంపై షర్మిల వరుస ట్వీట్లు చేశారు. 

‘కుర్చీ వేసుకొని మరీ పోడు భూముల లెక్క తేల్చుతా అని, ఈరోజు వాళ్లకు నీడ-గూడు లేకుండా.. ఆడవాళ్ళు అని చూడకుండా ఒంటి మీది గుడ్డలు ఊడిపోతున్నా, ఈడ్చి పడేపిస్తున్నారు. మొన్న చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టించారు. ఇయ్యాల ఆదివాసీలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. పోడు పట్టాల కోసం పోరాడుతున్న ఆదివాసీ ఆడ బిడ్డలను వివస్త్రను చేసిన పాలన మీ నయా నిజాం నిరంకుశ పాలనకు పరాకాష్ఠ. ఇది మీ పతనానికి సంకేతం. మీ పాలనకు ముగింపు’ అని షర్మిల పేర్కొన్నారు. పోడు సమస్యలు, పోలీసుల తీరపై ఆదివాసీ మహిళలు మాట్లాడుతున్న వీడియోను షర్మిల షేర్ చేశారు.


More Telugu News