ఎలాన్ మస్క్ యూ టర్న్.. ట్విట్టర్‌ను కొనుగోలు చేయట్లేదని ప్రకటన

  • స్పామ్ ఖాతాలకు సంబంధించి ఆధారాలు చూపించాల్సిందేనన్న మస్క్
  • అప్పటి వరకు ఒప్పందం ముందుకు సాగదని గతంలోనే పలుమార్లు స్పష్టీకరణ
  • మస్క్‌ నిర్ణయంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోన్న ట్విట్టర్
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌కు ఝలక్ ఇచ్చారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి వెనక్కి తగ్గారు. విలీన ఒప్పందంలోని పలు నిబంధనలను ట్విట్టర్ ఉల్లంఘించిందని పేర్కొన్న మస్క్.. 44 బిలియన్ డాలర్ల ఒప్పందం నుంచి వెనక్కి తగ్గినట్టు తెలిపారు. 

ట్విట్టర్ తమ నివేదికలో పేర్కొన్నట్టుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్ ఖాతాలు ఉన్నట్టు ఆధారాలు చూపించాల్సిందేనని మస్క్ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు డీల్ ముందుకు కదలదని పలుమార్లు తేల్చి చెప్పారు. ఇప్పుడు ఏకంగా డీల్‌నే రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మస్క్ యూటర్న్‌ను ట్విట్టర్ తీవ్రంగా పరిగణిస్తోంది. మస్క్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. మస్క్‌తో అంగీకరించిన ధర, నిబంధనల లావాదేవీలను కొనసాగించేందుకు ట్విట్టర్ బోర్డు కట్టుబడి ఉందని, విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు కొనసాగించాలని బోర్డు యోచిస్తోందని ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్ ట్వీట్ చేశారు.


More Telugu News