షింజో అబే మృతికి చంద్రబాబు సంతాపం... ఏపీకి స్నేహితుడని అభివర్ణన
- దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన అబే
- వార్త తెలిసిన వెంటనే స్పందించిన చంద్రబాబు
- సోషల్ మీడియా వేదికగా మాజీ ప్రధానికి నివాళి అర్పించిన వైనం
జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే మృతిపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అబే మృతి చెందినట్లు తెలిసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా అబే మృతికి సంతాపం ప్రకటించారు. జపాన్‌లోని నరా నగరంలో ఎన్నికల సందర్భంగా ప్రసంగిస్తున్న షింజోపై దుండగుడు కాల్పులు జరపగా... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా షింజో అబేతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు... అబేను ఏపీకి స్నేహితుడిగా అభివర్ణించారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము రూపొందించిన ప్రణాళికలపై అబే విశ్వాసం కనబరచారని చంద్రబాబు పేర్కొన్నారు. గొప్ప రాజనీతిజ్క్షుడిగానే కాకుండా ప్రపంచ స్థాయి నేతగా అబేను అభివర్ణించిన చంద్రబాబు..జపాన్‌ను తాను అనుకున్న రీతిలో అభివృద్ధి చేసి చూపిన నేతగానూ ఆయనను పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ట్వీట్‌కు షింజోతో తాను కలిసి దిగిన ఫొటోను చంద్రబాబు జత చేశారు.