దమ్ముంటే ఎన్నికలకు రండి: ఉద్ధవ్ థాకరే సవాల్

  • తాము తప్పు చేశామని భావిస్తే ప్రజలు తిరస్కరిస్తారన్న ఉద్ధవ్ 
  • శివసేన గుర్తును ఎవరూ తీసుకోలేరని కామెంట్ 
  • న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్న థాకరే 
శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసి, బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠాన్ని ఏక్ నాథ్ షిండే అధిరోహించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత తొలిసారి ప్రజలను ఉద్దేశించి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, దమ్ముంటే ఇప్పుడే మధ్యంతర ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. తాము తప్పు చేశామని ప్రజలు భావిస్తే తమను తిరస్కరిస్తారని చెప్పారు. 

అధికారాన్ని చేపట్టాలనే భావన ఉన్నప్పుడు... ఆ పనిని రెండున్నరేళ్ల క్రితమే చేయాల్సిందని... అలా చేసుంటే గౌరవంగా వుండేదని, అప్పుడు ఇదంతా జరిగి ఉండేది కాదని ఆయన ఏక్ నాథ్ షిండేను ఉద్దేశించి అన్నారు. శివసేనకు చెందిన ఎన్నికల గుర్తును ఎవరూ తీసుకోలేరని ధీమాగా చెప్పారు. అయినా ప్రజలు కేవలం ఎన్నికల గుర్తును మాత్రమే కాకుండా, వ్యక్తిని కూడా చూస్తారని అన్నారు. 

ఎమ్మెల్యేలను తీసుకెళ్లినంత మాత్రాన పార్టీని ఫినిష్ చేయలేరని థాకరే అన్నారు. లెజిస్లేచర్ పార్టీకి, రిజిస్టర్ అయిన పార్టీకి తేడా ఉంటుందని చెప్పారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇప్పటికీ 15 నుంచి 16 మంది ఎమ్మెల్యేలు తమతో ఉండటం పట్ల గర్విస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలపై ఆందోళన కలుగుతోందని... అయితే న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. న్యాయవ్యవస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే దానిపై ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. 



More Telugu News