కెప్టెన్లను బీసీసీఐ ఎందుకిలా మారుస్తోంది..?.. దీనికి రోహిత్ శర్మ సమాధానం ఇదిగో

  • ఆటగాళ్లు మారతారన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందేనని వ్యాఖ్య
  • బిజీ షెడ్యూల్ గురించి ప్రస్తావించిన రోహిత్ 
  • అన్నింటికీ సన్నద్ధతలో భాగమేనన్న టీమిండియా కెప్టెన్
రాహుల్ ద్రవిడ్ కోచ్ గా వచ్చిన తర్వాత నుంచి.. టెస్ట్ లు, వన్డేలు, టీ20లకు సంబంధించిన భారత జట్టు సారథులు వరుసగా మారుతుండడం కనిపిస్తోంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కు కూడా ఇదే సందేహం వచ్చింది. దీన్నే రోహిత్ శర్మ ముందు ప్రస్తావించాడు. 

‘‘మేము అన్నింటికీ సన్నద్దం కావాలి. షెడ్యూలింగ్ (బిజీ) తెలుసు. అందుకని ఆటగాళ్లు తరచూ మారతారని మేము కూడా అర్థం చేసుకోవాలి. బెంచ్ సంఖ్యను కూడా బలోపేతం చేయాలి. ముందుకు వచ్చి ఆడేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఐర్లాండ్ లో ఆడి వచ్చిన ఆటగాళ్లు కొందరు ఇక్కడ (ఇంగ్లండ్) కూడా ఆడనున్నారు’’ అని రోహిత్ వివరించాడు. 

ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఐర్లాండ్ లో టీ20 సిరీస్ కు హార్థిక్ పాండ్యా నేతృత్వం వహించాడు. ఇంగ్లండ్ తో ఒక్క టెస్ట్ కు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ కు పంత్ నాయకత్వ పాత్ర పోషించడం తెలిసిందే. 

ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచ కప్ కు బలమైన జట్టును రూపొందించే పనిలో రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. అందుకనే ఈ మార్పులు. వరుసగా సిరీస్ లు, బిజీ షెడ్యూల్ తో చాలా మంది కొత్త ఆటగాళ్లకు కూడా అవకాశాలు వస్తున్నాయి. కూర్పు కుదిరి మంచి ఫలాలు వస్తాయా? అంటే కాలం గడిస్తేనే తెలుస్తుంది. మరోవైపు రోహిత్ శర్మ 35 ఏళ్లకు వచ్చాడు. భవిష్యత్తు కెప్టెన్ ను గుర్తించేందుకు కూడా ఈ మార్పులు దోహదం చేస్తాయేమో చూడాలి.


More Telugu News