ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. తొలి టీ20లో భారత్ ఘన విజయం

  • 198 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్
  • నాలుగు వికెట్లు తీసుకున్న హార్దిక్ పాండ్యా
  • బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడిన ఇంగ్లండ్
  • 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో గత రాత్రి సౌతాంప్టన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీకి తోడు రోహిత్ శర్మ, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో భారత్ తొలుత 8 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. 

హార్దిక్ పాండ్యా విసిరిన పదునైన బంతులను ఎదుర్కోలేని ఇంగ్లిష్ బ్యాటర్లు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయారు. మొయిన్ అలీ చేసిన 36 పరుగులే ఆ జట్టులో అత్యధికం. డేవిడ్ మలాన్ (21), హారీ బ్రూక్ (28), క్రిస్ జోర్డాన్ (26) పరుగులు చేశారు. కెప్టెన్ జోస్ బట్లర్, లియామ్ లివింగ్ స్టోన్, మాథ్యూ పార్కిన్సన్ డకౌట్ కాగా, జాసన్ రాయ్ 4, శామ్ కరన్ 4, టైమల్ మిల్స్ 7, రీస్ టోప్లే 9 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు సాధించింది. హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 51 పరుగులు చేయగా, దీపక్ హుడా 17 బంతుల్లో 3 ఫోర్లు, 2  సిక్సర్లతో 33, సూర్యకుమార్ యాదవ్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 14 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 17, దినేశ్ కార్తీక్ 11 పరుగులు చేశాడు. ఇంగ్లిష్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండో టీ20 ఎడ్జ్‌బాస్టన్‌లో రేపు జరుగుతుంది.


More Telugu News