దేశంలో మరో ఎయిర్ లైన్స్ సంస్థ... 'ఆకాశ ఎయిర్' కు డీజీసీఏ పచ్చజెండా

  • రాకేశ్ ఝున్ ఝున్ వాలా మద్దతుతో ఆకాశ ఎయిర్
  • బడ్జెట్ ఎయిర్ లైనర్ గా రంగప్రవేశం
  • ఏఓసీ మంజూరు చేసిన డీజీసీఏ
  • జులై నెలాఖరు నుంచి విమాన సర్వీసులు
దిగ్గజ పెట్టుబడిదారుడు రాకేశ్ ఝున్ ఝున్ వాలా మద్దతుతో భారత్ విమానయాన రంగంలోకి అడుగుపెడుతున్న కొత్త ఎయిర్ లైన్స్ సంస్థ ఆకాశ ఎయిర్. ఆకాశ ఎయిర్ త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ నూతన ఎయిర్ లైన్స్ సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా పచ్చజెండా ఊపింది. విమాన సర్వీసులకు అవసరమైన అనుమతులు మంజూరు చేసింది. విమానాలు నడిపేందుకు అవసరమైన ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ (ఏఓసీ)ని అందజేసింది. ఈ నేపథ్యంలో, జులై నెలాఖరుకు ఆకాశ ఎయిర్ తొలి విమానం గాల్లోకి లేవనుంది. 

ఆకాశ ఎయిర్ ప్రధానంగా చవకధరల విమానయాన సంస్థ. భారత విమానయాన రంగ దిగ్గజం వినయ్ దూబే స్థాపించిన ఆకాశ ఎయిర్ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. త్వరలోనే మరో రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను అందుకోనుంది. 

ఆకాశ ఎయిర్ కు సీఈఓగా వ్యవహరిస్తున్న వినయ్ దూబే తాజా పరిణామాలపై స్పందిస్తూ, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా సేవలు అందించాలన్నది తమ లక్ష్యమని, ఆ దిశగా ప్రస్థానం ప్రారంభిస్తున్నామని తెలిపారు.


More Telugu News