నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా రేపటి నుంచి వైసీపీ ప్లీనరీ... విజయమ్మ వస్తున్నారన్న విజయసాయిరెడ్డి

  • రేపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి
  • రేపటి నుంచి రెండ్రోజుల పాటు ప్లీనరీ
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
  • ప్లీనరీ ద్వారా తాము చేసిన మంచిని చెబుతామన్న విజయసాయి
రేపు (జులై 8) వైఎస్సార్ జయంతి కాగా, రేపటి నుంచి రెండ్రోజుల పాటు వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈ నెల 8, 9 తేదీల్లో ప్లీనరీ నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ప్లీనరీలో పాల్గొనే పార్టీ ప్రతినిధులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్లీనరీ ప్రాంగణాన్ని వైసీపీ మంత్రులు, ఆ పార్టీ అగ్రనేతలు నేడు పరిశీలించారు. నేటి సాయంత్రం కల్లా నియోజకవర్గాల ఇన్చార్జిలకు పాస్ లు పంపిణీ చేయనున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 

కాగా, వైసీపీ ప్లీనరీ సమావేశాలపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. విజయమ్మ ఈ ప్లీనరీకి వస్తారో, రారో అని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన బదులిచ్చారు.  ప్లీనరీ సమావేశాలకు వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వస్తున్నారని స్పష్టం చేశారు. 

వైసీపీ ప్లీనరీకి స్పెషల్ గెస్టులుగా ఎవరినీ పిలవడంలేదని తెలిపారు. ప్లీనరీలో పార్టీ పరమైన తీర్మానాలు, పలు అభివృద్ధి పథకాలపై తీర్మానాలకు ఆమోదం తెలుపుతామని వెల్లడించారు. తమ ప్రభుత్వ పథకాలను, ఇప్పటివరకు చేసిన, ఇకపై చేయబోయే మంచిని కూడా ఈ ప్లీనరీ ద్వారా ప్రజలకు వివరిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.


More Telugu News