బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్

  • బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం
  • పలు వివాదాల్లో బోరిస్ జాన్సన్
  • ప్రధాని పదవికి రాజీనామా
  • అక్టోబరులో బ్రిటన్ కు కొత్త ప్రధాని
  • రిషి సునక్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న వైనం
గత కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం అందరికంటే ఎక్కువగా రిషి సునక్ పేరు వినిపిస్తోంది. ఈయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షత మూర్తిని వివాహమాడారు. 

42 ఏళ్ల రిషి సునక్ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీల నుంచి డిగ్రీలు అందుకున్నారు. ఆయన 2020లో చరిత్ర సృష్టించారు. బ్రిటన్ క్యాబినెట్ లో ఎంతో కీలకమైన ఆర్థికమంత్రి పదవిని చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. రిషి సునక్ ను బోరిస్ జాన్సన్ ఏరికోరి క్యాబినెట్ లోకి తీసుకువచ్చారు. జాన్సన్ నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఆర్థికశాఖను సమర్థంగా నిర్వర్తించారు. ఇటీవల కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులు నష్టపోకుండా ఆయన తీసుకువచ్చిన ప్యాకేజి సర్వత్రా ప్రశంసలు అందుకుంది. 

అయితే, ఇటీవల బోరిస్ జాన్సన్ చర్యలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రిషి సునక్ కొన్నిరోజుల కిందటే పదవికి రాజీనామా చేశారు. సునక్ బాటలోనే పలువురు క్యాబినెట్ సహచరులు కూడా నడవడంతో బోరిస్ జాన్సన్ పై ఒత్తిడి అధికమైంది. మొత్తం 40 మంది వరకు మంత్రులు క్యాబినెట్ ను వీడారు. వీరందరూ కూడా రిషి సునక్ నాయకత్వానికి మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లోనూ ఆయనపై సానుకూలత ఉంది. 

అన్నీ కుదిరితే అక్టోబరు నుంచి రిషి సునక్ ను ప్రధాని పీఠంపై చూడొచ్చు. అదే జరిగితే బ్రిటన్ ప్రధాని అయిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడు. కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు బోరిస్ జాన్సన్ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు.

కాగా, రిషి సునక్ కు ఒకే ఒక్క ప్రతికూలత కనిపిస్తోంది. ఇటీవల ఆయన అర్ధాంగి అక్షత మూర్తిపై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. అక్షత భారత్ కు చెందిన మహిళ కావడంతో ఆమె నాన్ డొమిసైల్ హోదాలో బ్రిటన్ లో ఉంటున్నారు. ఆమెకు భారత పౌరసత్వం మాత్రమే ఉండడంతో బ్రిటన్ లో నాన్ డొమిసైల్ పన్ను హోదా కల్పిస్తారు. నాన్ డొమిసైల్ హోదా ఉన్న వారు విదేశీ గడ్డపై సంపాదించే సొమ్ముకు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. దీన్ని వాడుకుని అక్షత మూర్తి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని బ్రిటన్ విపక్షాలు దుమారం రేపాయి. 

అందుకు అక్షత మూర్తి బదులిస్తూ, తాను బ్రిటన్ లో చట్టప్రకారం చేస్తున్న వ్యాపారాలకు పన్నులు చెల్లిస్తున్నానని స్పష్టం చేశారు. అక్షతపై ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమేని రిషి సునక్ వర్గం ఎదురుదాడికి దిగింది.


More Telugu News